-
ఆమె స్థానంలో ఎవరు?
-
అప్పుడే రేసులో పదుల సంఖ్యలో ఆశావాహులు
-
బీసీ కోటా నుంచి అధికం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ క్యాబినెట్ నుంచి కొండా సురేఖ ఉద్వాసన తప్పదా? ఆమెను మంత్రివర్గం నుంచి తొలగిస్తారా? సీఎం రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే నిర్ణయం ఉంటుందా? మరి ఆమె స్థానంలో కొత్తగా ఎవరిని తీసుకుంటారు? తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో దీని పైనే పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
ఇటీవల కొండా సురేఖ అసంతృప్త వ్యాఖ్యలకు తోడు.. ఆమె కుమార్తె సుస్మిత పటేల్ చేసిన కామెంట్స్ తెలంగాణ అధికార పార్టీలో సెగలు పుట్టించాయి. సీఎం రేవంత్ తో పాటు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీనిపై క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది కొండా సురేఖకు.
అయితే సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడిపై తన కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోగా.. వాటితో తనకు అసలు సంబంధం లేదంటూ తేల్చి చెప్పారు. కనీసం క్యాబినెట్ లో ఉంటూ ముఖ్యమంత్రి పై చేసిన విమర్శలను ఆమె ఖండించలేదు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు మంత్రి పదవి తొలగించాలని డిమాండ్ చేశారు.
-
టిపిసిసి క్రమశిక్షణ కమిటీ నోటీసులు..
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులకు సమాధానం ఇచ్చిన కొండా సురేఖ సీఎం వచ్చిన వెంటనే తేల్చుకుంటామని ప్రకటించారు. దీంతో ఆమె పై వేటు పడడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. ఒకవేళ ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించినా.. పార్టీకి రాజీనామా చేసినా.. ఆమె ఖాళీ చేయబోయే మంత్రి పదవిని ఎలా భర్తీ చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న.
ప్రధానంగా ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లా కోటాను దృష్టిలో ఉంచుకొని.. అధిష్టానం పలువురి పేర్లను పరిశీలిస్తోందని ప్రచారం తెరమీదకు వచ్చింది. అయితే ఆశావహులు ఎవరికి వారే తమ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ మంత్రివర్గం నుంచి తొలగించిన మరుక్షణం తమకు ఆ పదవి ఇవ్వాలని కోరుతున్న వారు అధికం అవుతున్నారు.
-
చాలామంది ఆశలు
ప్రధానంగా మంత్రి పదవులు పై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన బీసీ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. అందులో ఆది శ్రీనివాస్ ముందు వరుసలో ఉండగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బసవరాజు సారయ్య సైతం తన ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికే క్యాబినెట్లో ముగ్గురు ఉన్నారు.
అందులో బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్, దళిత సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి శ్రీధర్ బాబుకు చోటు దక్కింది. అయితే మరొకరికి చాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రేసులో ఉన్నారు.
ఆయనకు అవకాశం ఇస్తే బీసీ తో పాటు సురేఖ స్థానంలో వరంగల్ జిల్లాకు స్థానం కల్పించినట్టు అవుతుంది. ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగుస్తుంది. కాబట్టి ఆయనకు అవకాశం కష్టమే.
-
ప్రతి ఒక్కరూ రేసులో..
ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఒకవేళ ఐలయ్యకు ఇస్తే రాజగోపాల్ రెడ్డికి మొండిచేయి తప్పదు.
మహబూబ్‌నగర్ నుంచి వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు మంత్రివర్గంలో ఉన్నారు. ఆ జిల్లా నుంచి సైతం వీర్లపల్లి శంకర్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆలు లేదు చులు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. ఇంకా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించలేదు. అప్పుడే మంత్రి పదవుల రేసులో అంటూ అధికార కాంగ్రెస్‌లో ప్రచారం మొదలైంది. చూడాలి ఏం జరుగుతుందో..
