తెలంగాణ రోడ్డు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెచ్చిపోయారు. అధికారులపై విరుచుకుపడ్డారు. తాట తీస్తానని హెచ్చరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో ఆర్ అండ్ బీ లోని వివిధ విభాగాల పనితీరుపై అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి. తన శాఖలోని కొందరు అధికారుల అలసత్వంపై తీవ్రంగా స్పందించారు.
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రిపేర్లు చేయడం ఎందుకు ఆలస్యం అవుతుందని అధికారులను ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎస్టిమేషన్లు, టెండర్లని కాలం వెల్లదీస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. డిపార్ట్ మెంట్ లో సర్వీస్ రూల్స్ కావాలంటే తెచ్చా, ట్రాన్స్ ఫర్లు చేసుకుంటామంటే అనుమతించా.. మీరు ఏదడిగితే అది చేస్తున్నప్పటికి.. మీ పనితీరు ఏం మెరుగుపడలేదని మండిపడ్డారు.
మన పక్కరాష్ట్రాల్లో రోడ్ల రిపేర్లకు జెట్ ప్యాచ్ వర్క్ మెషిన్లు, వెలాసిటీ ప్యాచింగ్ వంటి అధునాతన పద్ధతులతో పాట్ హోల్స్ పడిన వెంటనే పూడుస్తున్నారని కోమటిరెడ్డి చెప్పారు. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉన్న మన దగ్గర మాత్రం ఇంకా పురాతన పద్ధతుల్లో పాట్ హోల్స్ రిపేర్లు చేస్తున్నామని.. ఇది మన ఆర్ & బీ అధికారులకు తమ నైపుణ్యాల పట్ల ఉన్న శ్రద్ధ అంటూ సున్నితంగా చురకలు అంటించారు. రూ. 500 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు 4-5 వేల కోట్ల విలువ చేసే రోడ్లను రిపేర్ చేయవచ్చని కానీ.. ఎక్కడా ఆవైపుగా పనులు జరగడం లేదని స్టేట్ రోడ్స్ సీఈ మోహన్ నాయక్ ను ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన ఏఈఈలను ఇప్పటిదాక కనీసం ఫీల్డ్ మీదకు కూడ పంపకపోవడం ఏంటని నిలదీశారు. ఇంజనీర్లంతా ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతూ కొత్త రోడ్లను ప్రపోజల్స్ తయారు చేసే కన్సల్టెంట్లుగా మారారని.. అసలు పాట్ హోల్స్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి ఇంజనీర్లకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు.
మంత్రివర్గ సమావేశంలో చర్చించిన పీపీపీ మోడల్ రోడ్స్ పై ఐడెంటీఫికేషన్ పై స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ను అడగ్గా.. ఇప్పటి వరకు 1787.06 కిలోమీటర్ల కలిగిన 20 రోడ్లను గుర్తించామని చెప్పారు. ఏ రోడ్డు నిర్మాణ పద్దతి అవలంభించినా.. అంతిమంగా ప్రజల మీద భారం పడకుండా ఉండే పీపీపీ మోడల్ ను తీసుకురావాలని చెప్పారు. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వంటి రాష్ట్రాల్లో ఆర్డీసీ అనుసరిస్తున్న రోడ్డు నిర్మాణ పద్ధతులను అనుసరిస్తున్నామని అధికారులు మంత్రిదృష్టికి తెచ్చారు. ప్రతీ రివ్యూలో అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నారు ప్రారంభించే టైం పెంచడం తప్పా ఇప్పటిదాక ఏం పురోగతి కనిపించడం లేదని బిల్డింగ్స్ సెక్షన్ సీఈ రాజేశ్వర్ రెడ్డిపై మంత్రి అసహనంవ్యక్తం చేశారు. నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణంలో ఇప్పటిదాక ఒక్క పురోగతిని చూపించలేదని నిర్వేదం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాథమిక అవసరమైన హాస్పిటల్స్ నిర్మాణంలో ఇంత నిర్లక్ష్యం దేనికని ప్రశ్నించారు. ప్రభుత్వం దవాఖానాలు అందుబాటులోకి రాకపోతే పేద ప్రజలు కార్పోరేట్ హాస్పిటల్స్ లో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చికిత్సలు తీసుకోకుండా ప్రాణాలు పొగొట్టుకుంటారని.. దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.
ముఖ్యమంత్రితో, ఉప ముఖ్యమంత్రితో మీ ముందే మాట్లాడి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాను.. అయినా ఎందుకు నిర్మాణాలు ఆలస్యం జరుగుతున్నాయని ఆయన నిలదీశారు. రోజు వేలాదిమంది వచ్చే నిమ్స్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుంటే.. మీరంతా ఏం చేస్తున్నారని పశ్నించారు. ఇప్పటికైనా అధికారులంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చే జూలై, 2025 నాటికి టిమ్స్ హాస్పిటల్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు సూచించారు. ఈ క్రమంలో మంత్రి సెక్రెటరేట్ లోని తన చెయిర్ క్రింద టైల్స్ ఫిటింగ్ నిర్లక్ష్యాని అధికారులకు స్వయంగా చూపించారు.. వెయ్యికోట్లకు పైగా ఖర్చుపెట్టినమని చెప్పిన రాష్ట్ర సచివాలయంలో మన ఇంజనీర్ల పనితీరు ఇంత నిర్లక్ష్యంగా ఉందని.. టైల్స్ మధ్యనున్న గ్యాప్స్ ను చూపించారు. మనం ఖర్చుపెట్టే ప్రతీ పైసా ప్రజల సొమ్మని.. దాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు.
గత ప్రభుత్వంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూసీచూడనట్లు వదిలేప్రసక్తేలేదని కోమటిరెడ్డి తేల్చిచెప్పారు. ప్రతీది నాణ్యంగా ఉండాలి, ప్రతీ పని ప్రజలు మెచ్చుకునేలా చేయాలని సూచించారు. ప్రతీవారం టీమ్స్ హాస్పిటల్ భవనాల నిర్మాణ స్థితిగతులపై రివ్యూలు నిర్వహించి రిపోర్ట్ ఇవ్వాలని స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రెటరీ శ్రీమతి దాసరి హరిచందనను ఆదేశించారు.ఇదే క్రమంలో ఒక్కొక్కరికి రెండు, మూడు అదనపు బాధ్యతలు ఉన్నాయని ప్రమోషన్లు ఇస్తే.. కొంత భారం తగ్గుతుందని ఈఎన్సీ మధుసూధన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఇన్ని బాధ్యతులు మోస్తే ఎందుకు పాట్ హోల్స్ రిపేర్ కాలేదు, ఎందుకు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం పూర్తి కాలేదని ప్రశ్నించారు. హక్కుల గురించి అడిగేటప్పుడు బాధ్యతలు కూడా నిర్వర్తించాలని సున్నితంగా హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి ….
విద్యార్థిని తొడ కొరిగిన టీచర్.. ఇంట్లో చెప్తే చంపేస్తా అంటూ బెదిరింపులు
తలకాయే తీసేసారు.. రాహుల్ పర్యటన రోజే దారుణం
భార్యపై కోపంతో కారు యాక్సిడెంట్ చేసిన వ్యాపారి
కేసీఆర్ కు వార్నింగ్.. బాబుకు సపోర్ట్.. ఒవైసీ యూ టర్న్