HomeతెలంగాణJeevan Reddy: జీవన్ రెడ్డి ఇమేజ్ క్లోజ్.. బీఆర్ఎస్ లో చేరికతో తెరవెనుకకే పరిమితం!

Jeevan Reddy: జీవన్ రెడ్డి ఇమేజ్ క్లోజ్.. బీఆర్ఎస్ లో చేరికతో తెరవెనుకకే పరిమితం!

*సొంత ఇమేజ్ కోల్పోయిన పలువురు నేతలు

*ఆలె నరేంద్ర నుంచి ఈటల రాజేందర్ దాకా అంతే

*గులాబీ నీడన మసకబారిన డీఎస్ రాజకీయ జీవితం

*పొన్నాల లక్మయ్య ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి

*గౌరవించే కాంగ్రెస్ ను వీడి తప్పుచేసిన జీవన్ రెడ్డి?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: దశాబ్దాలపాటు కాంగ్రెస్ లో కొనసాగి.. రిటైర్మెంట్ దశలో బీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి నిర్ణయంపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ను వీడి జీవన్ రెడ్డి తప్పు చేశారని అంటున్నవారే ఎక్కవ ఉన్నారు. గతంలో కేసీఆర్ పంచన చేరిన వారంతా తమకున్న సొంత ఇమేజ్ ను కోల్పోయారని, ఇప్పుడు జీవన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే అవుతుందని అంటున్నారు.

జగిత్యాలలో తనను ఎమ్మెల్యేగా ఓడించిన వ్యక్తిని తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెడతారా? అంటూ కాంగ్రెస్ పార్టీపై అలిగి బీఆర్ఎస్ లో చేరారు.. సీనియర్ నేత, మాజీమంత్రి టి.జీవన్ రెడ్డి. కానీ, ఈ నిర్ణయం సరైనదికాదన్న అభిప్రాయాలే   ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరో రెండున్నరేళ్లపాటు అధికారంలో ఉండే పార్టీని వీడి.. ప్రతిపక్ష పార్టీలో చేరడం ఇందుకు ఒక కారణమైతే.. సొంత ఇమేజ్ ఉన్న నేతలు బీఆర్ఎస్ లో చేరాక కనుమరుగైన ఉదంతాలు ఉండడం మరో కారణం. తెలంగాణ ఉద్యమ సమయంలో తనకంటూ సొంత పార్టీ పెట్టుకున్న ఆలె నరేంద్రను కేసీఆర్ తన పార్టీలోకి ఆహ్వానించి.. ఆ తరువాత ఆయనకు ప్రాధన్యం తగ్గించి, చివరికి ఆయన ఇమేజ్ మసకబారేలా చేశారు. చివరికి నరేంద్ర అవమానాలకు గురై అనారోగ్యంపాలై మృతి చెందారు. ఆ తరువాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం ఉద్యమించిన సినీ నటి విజయశాంతి కూడా కేసీఆర్ వ్యూహాలకు బలై రాజకీయంగా బాధితురాలిగా మారారు.

ఈటల నుంచి పొన్నాల లక్మయ్య దాకా..

ఈటల రాజేందర్ విషయమైతే ప్రపంచంలోని తెలుగు వారందరికీ తెలిసిన అంశమే. మంత్రిగా ఉన్న ఈటలకు సంబంధించి ఆస్తలను టార్గెట్ చేసుకొని మంతివర్గం నుంచి తప్పించి.. చివరికి అవమానకర రీతిలో బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. ఇక ప్రస్తత మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినవారే. వీరిద్దరి విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. వీరిని ఓడించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చకుని నియోజకవర్గంలో వీరిని జీరోగా మార్చేయడంతో ఈ ఇద్దరూ తమ దారి వెతుక్కున్నారు. కానీ, ఇప్పుడు జగిత్యాలలో బీఆర్ఎస్  తరఫున గెలిచిన డాక్టర్ సంజయ్ ని కాంగ్రెస్ లో చేర్చుకున్నారన్న కారణంతో జీవన్ రెడ్డి.. గులాబీ గూటికి చేరుకున్నారు. సీనియర్ నేతగా ఉండి పార్టీ మారడం వెనుక కారణాలను జీవన్ రెడ్డి చెప్పినా.. డి.శ్రీనివాస్, పొన్నాల లక్మయ్య పరిస్థితి ఏమైందన్నదీ గుర్తుంచుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంపై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని అంటున్నారు. ‘జూపల్లి. తుమ్మలకు కనీసం తమ నియోజకవర్గం పరిధిలోని వార్డు మెంబర్ అభ్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు. మున్ముందు జీవన్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే అవుతుందని చెప్పారు. కానీ, రేవంత్ రెడ్డి తీరు వల్లే తాను పార్టీ మారాల్సివచ్చిందని జీవన్ రెడ్డి చెప్పారు. దీంతో ఇద్దరికి మధ్య గ్యాప్ ఎక్కడ మొదలైంది? అనే ప్రశ్న తలెత్తుతోంది. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవటం ద్వారా నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది సీఎం రేవంత్ ఆలోచన. సీనియర్ నేత జీవన్ రెడ్డి బలమైన నేత అయినప్పటికీ.. ప్రస్తుత ఎమ్మెల్యేను పార్టీ వైపు తిప్పుకోవటం ద్వారా ప్రత్యర్థి పార్టీని దెబ్బ కొట్టొచ్చన్నది రేవంత్ ఆలోచనగా చెబుతారు. అదే సమయంలో.. జీవన్ రెడ్డి తనకు గౌరవప్రదమైన పోస్టును ఆశించారు. అది రేవంత్ సర్కారులో రాకపోవటం ఆయనకు మరింత అసంత్రప్తికి కారణమైంది.

సొంత టీమ్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు..

రేవంత్ తన టీంను తయారు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెబుతారు. అదే సమయంలో తనతో కలిసేందుకు.. తనతో పొసగనట్లుగా ఉండే జీవన్ రెడ్డి లాంటి వారిని దగ్గరకు తీసుకునే కన్నా.. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేసుకునే వ్యూహంలో ఉన్నారు. వెరసి.. ఇద్దరి మధ్య దూరం పెరగటమే కాదు.. ఇప్పుడు పార్టీకి దూరమయ్యే పరిస్థితి. సీనియర్లతోకలిసి పని చేసేందుకు సీఎం రేవంత్ సిద్ధమవుతున్నా.. ఆయన్ను తక్కువగా చూడటం.. కలిసి పని చేసే విషయంలో ఆసక్తి లేని నేతలకు దూరంగా ఉంటూ.. వారిస్థానంలో కొత్త వారిని.. బలమైన వారిని రీప్లేస్ చేసుకోవటం సీఎం రేవంత్ లో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు జీవన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేసి.. గులాబీ కారులో ఎక్కేలా చేశాయని చెప్పొచ్చు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు