ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమాన కెప్టెన్‌పై దాడి చేసి, విమానాన్ని ప్రమాదంలోకి నెట్టేందుకు ప్రయత్నించిన ఒమనీ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ.. తన చర్యకు గాజాలో జరుగుతున్న పరిణామాలే కారణమని దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
తన చర్యల వెనుక ప్రతీకార భావనే ఉందని హమ్మామీ పేర్కొన్నట్లు ఆ కథనం తెలిపింది. అంతేకాకుండా, తాను అమరుడిగా మరణించాలనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డానని అతడు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వాంగ్మూలానికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ వెలువడలేదు.
తీవ్రవాద భావజాలంపై గతంలోనే ఆరోపణలు
హమ్మామీ గతంలో ఒమన్‌కు చెందిన జాతీయ విమానయాన సంస్థలో పనిచేసినట్లు సమాచారం. తీవ్రవాద భావజాలానికి సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో గతేడాది అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి.
అనంతరం అతడి పేరుతో ఉన్నట్లు చెబుతున్న సోషల్ మీడియా ఖాతాల్లో ఇజ్రాయెల్ విమానాలకు సంబంధించిన కాక్‌పిట్ వీడియోలు, అల్‌ఖైదా నాయకులకు సంబంధించిన పోస్టులు కనిపించినట్లు సీఎన్ఎన్ నివేదించింది. ఈ పరిణామాల నేపథ్యంలో హమ్మామీపై తీవ్రవాద భావజాల ప్రభావం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా గతంలో ఇదే తరహా అనుమానాలను వ్యక్తం చేసినట్లు సమాచారం.
విమానం కూలిపోయేంత ప్రమాదకర పరిస్థితి
సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్‌కు చెందిన 1073 విమానం దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు బయలుదేరింది. ల్యాండింగ్‌కు సుమారు గంట సమయం మాత్రమే ఉన్న సమయంలో విమానంలో తీవ్ర పరిణామం చోటుచేసుకుంది.
కాక్‌పిట్‌లో ఉన్న కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై హమ్మామీ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆ సమయంలో విమానం ఒక్కసారిగా భారీగా కిందికి దూసుకెళ్లినట్లు విమాన ట్రాకింగ్ డేటా వెల్లడించింది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే విమానం 17 వేల అడుగులకు పైగా దిగిపోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ప్రయాణికుల సహకారంతో అదుపులోకి
దాడిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితిని ఎదుర్కొని కోపైలట్‌ను అడ్డుకున్నాడు. అనంతరం కాక్‌పిట్ తలుపు తెరుచుకోవడంతో ప్రయాణికులకు అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలిసాయి.
వెంటనే కొందరు ప్రయాణికులు కలిసి హమ్మామీని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో విమానంలో ఉన్న ఇద్దరు ఆఫ్‌డ్యూటీ పైలట్లు కాక్‌పిట్‌లోకి వెళ్లి విమాన నియంత్రణను చేపట్టారు. వారి జోక్యంతో విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోగలిగింది.
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. హమ్మామీ నిజంగా ఏ ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డాడనే అంశంపై అధికారిక విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: 89 ఏళ్ల వృద్ధుడి ఫిర్యాదు.. ప్రముఖ యూట్యూబర్‌పై చోరీ, బెదిరింపుల కేసు
