హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్ పరిధిలోని చెరువుల సంరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా (HYDRAA) అధికారులు శనివారం ఉదయాన్నే నార్సింగిలో మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగిన హైడ్రా బృందాలు నార్సింగిలోని ప్రముఖ ముష్కి (ముష్కిన్) చెరువు పరిరక్షణ చర్యలను వేగవంతం చేశాయి. 10 ఎకరాలు కబ్జా.. రియల్ వ్యాపారుల చేతుల్లో చెరువు స్థలం, మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కి చెరువులో, సుమారు 10 ఎకరాల మేర చెరువు స్థలం కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పలువురు బిల్డర్లు చెరువు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి పెద్ద ఎత్తున నిర్మాణాలకు పాల్పడినట్లు తేలింది.
రంగంలోకి జెసిబిలు.. ‘స్కైలా’ అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ కూల్చివేత…
చెరువు ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రసిద్ధ ‘స్కైలా’ (Skyla) అపార్ట్మెంట్‌కు చెందిన కాంపౌండ్ వాల్ (రక్షణ గోడ)ను అధికారులు ఈరోజు ఉదయం జెసిబిల సహాయంతో నేలమట్టం చేశారు.
50 ఎకరాలకు కంచె.. భారీ పోలీస్ బందోబస్తు…
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు స్థానికులు, బిల్డర్ల నుంచి ప్రతిఘటన ఎదురుకాకుండా ఉండేందుకు పటిష్టమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించి, వారి బందోబస్తు మధ్య ప్రస్తుతం ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కబ్జాల బారిన పడకుండా మిగిలిన సుమారు 50 ఎకరాల చెరువు స్థలానికి చుట్టూ ఇరిగేషన్, హైడ్రా అధికారులు సంయుక్తంగా శాశ్వత కంచె (Fencing) ఏర్పాటు చేసే పనులను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.
అధికారుల హెచ్చరిక…
చెరువుల పరిరక్షణలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఎంతటి వారైనా సరే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను వదిలిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేశారు. చెరువు కానుకొని ఉన్న విల్లాలు, పెద్ద భవనాల్లోని తాత్కాలిక గుడిసెలను తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరించారు.