HomeజాతీయంArvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్.. కోర్టు ధిక్కార నోటీసులు జారీ!

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్.. కోర్టు ధిక్కార నోటీసులు జారీ!

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు ఆప్‌ నేతలకు ఢిల్లీ హైకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. జస్టిస్‌ నవీన్‌ చావ్లా, జస్టిస్‌ రవీందర్‌ డూడేజాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. అలాగే జస్టిస్‌ స్వర్ణకాంత శర్మపై ఆప్‌ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను భద్రపరచాలని హైకోర్టు రిజిస్ట్రీకి సూచించింది.

జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఆప్ నేతల ఆరోపణలు

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసు విచారణ జరుగుతున్న సమయంలో కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా, దుర్గేశ్‌ పాఠక్‌ సహా మరికొందరు ఆప్‌ నేతలు జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఎదుట విచారణకు హాజరు కాబోమని బహిరంగంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెపై కొన్ని ఆరోపణలు కూడా చేశారు. జడ్జిపై చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, అవి కోర్టు ధిక్కారానికి వస్తాయని పేర్కొంటూ జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.

కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ

ఈ పరిణామాల తర్వాత జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ మద్యం పాలసీ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన సీబీఐ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేశారు. ఇక నుంచి జస్టిస్‌ మనోజ్‌ జైన్‌ ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించనుంది. మరోవైపు, కేసు విచారణ బెంచ్‌ మారిన విషయాన్ని కేజ్రీవాల్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 23 మందికి తెలియజేయాలని జస్టిస్‌ మనోజ్‌ జైన్‌ సీబీఐకి ఆదేశించారు. ఈ కేసుపై మే 25 నుంచి విచారణ ప్రారంభిస్తామని కూడా కోర్టు స్పష్టం చేసింది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోర్టు ధిక్కార నోటీసులు జారీ కావడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు