Homeఆంధ్ర ప్రదేశ్క్యాసినో కింగ్ చీకోటికి క‌మ‌లంలో స్థానం...! బీజేపీ పెద్ద‌ల‌పై ప‌లువురు విమ‌ర్శ‌లు

క్యాసినో కింగ్ చీకోటికి క‌మ‌లంలో స్థానం…! బీజేపీ పెద్ద‌ల‌పై ప‌లువురు విమ‌ర్శ‌లు

  • క‌ష్ట‌ప‌డ్డవారిని గుర్తించ‌ని బీజేపీ అధిష్టానం

  • బీజేపీలో కొత్త చ‌ర్చ‌కు దారి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడికి బీజేపీలో సముచిత స్థానం లభించింది. అయితే అది ఏపీలో కాదు. తెలంగాణలో ఆయన అనుచరుడిగా గుర్తింపు ఉన్న చీకోటి ప్రవీణ్ కు బీజేపీ అధికార ప్రతినిధిగా పదవి దక్కింది. క్యాసినో కింగ్ గా గుర్తింపు తెచ్చుకొని వందల కోట్లను ఆర్జించారని కేసులు ఎదుర్కొంటున్నారు చీకోటి ప్రవీణ్. బిజెపి ఆయనకు కీలక పదవిని అప్పగించింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రావు నూతన పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించారు. నియామకాల కు సంబంధించిన జాబితాను విడుదల చేశారు. అందులో చికోటి ప్రవీణ్ కు అవకాశం దక్కడం విశేషం.

అధికార ప్రతినిధిగా పదవి...

భాగ్యనగర్, మలక్ పేట ప్రాంతాల అధికార ప్రతినిధిగా చీకోటి ప్రవీణ్ కుమార్ ని నియమించారు. దీంతో ఆయన ఆయా ప్రాంతాలకు చెందిన బిజెపి వ్యవహారాలకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తారు. పార్టీ తరపున కార్యక్రమాల నుంచి మీడియా బ్రీఫింగ్ ల వరకు చీకోటి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే బీజేపీలో చాలామంది పదవుల కోసం వేచి చూడగా చీకోటి ప్రవీణ్ లాంటి వ్యక్తికి కీలక నియామకం చేపట్టడం మాత్రం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.

కొడాలి నానికి సన్నిహితుడు…

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని కి అత్యంత సహచరుడు ప్రవీణ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గుడివాడ కేంద్రంగా కేసినో నిర్వహించి కోట్లాది రూపాయలు దండుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లోనే టిడిపి నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. చివరకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేదాకా పరిస్థితి వచ్చింది.

స్విట్జర్లాండ్ తో సహా పలు దేశాల క్యాసినో నిర్వాహకులతో సంబంధాలు ఉన్నాయని స్వయంగా చీకోటి ప్రవీణ్ అప్పట్లో అంగీకరించారు. వైసిపి హయాంలో సంక్రాంతితో పాటు దసరా ఉత్సవాల నాడు క్యాసినో నిర్వహించేవారు. దీని ఎంట్రీ అప్పట్లో లక్షల రూపాయలు ఉండేదన్న ఆరోపణలు ఉన్నాయి. అశ్లీల నృత్యాలు, పేకాటలు, మందు మాదక ద్రవ్యాలు కూడా సరఫరా చేశారన్న కేసులు నమోదయ్యాయి.

దీంతో స్విట్జర్లాండ్ కు పారిపోయే ప్రయత్నం చేయగా ఆయనను అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివార్లలో అతిపెద్ద ఫామ్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకుని నెమళ్లు, క్రూర మృగాలు, కొండచిలువలను పెంచడం చీకోటి హాబీ. అలాంటి వ్యక్తి బీజేపీలో ఎప్పుడు చేరారు? ఆయనకు ఇప్పుడు పదవి ఇవ్వడం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. బిజెపిలో కష్టపడి పనిచేసిన వారికి కాకుండా ఇటువంటి వ్యక్తులకు పదవులు ఇవ్వడం ఏమిటనేది హాట్ టాపిక్ అవుతోంది.

తాజావార్తలు