క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో సరికొత్త వ్యాధి ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పశువుల పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైన బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా బనవాసి జెర్సీ పశు క్షేత్రంలోని ఆబోతు వీర్య నిల్వ కేంద్రంలో ఈ బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా వెలుగులోకి వచ్చింది. బనవాసి జెర్సీ పశు క్షేత్రంలోని ఆబోతు వీర్య నిల్వ కేంద్రంలో ఎనిమిది పశువులతోపాటు వాటిని సంరక్షించే ఇద్దరు కూలీలకు కూడా బ్రూసెల్లోసిస్ నిర్ధారణ అయింది. ఈ జబ్బు క్రమంగా మనుషులకు విస్తరించే ప్రమాదం ఉందని పరిసర గ్రామాల రైతులు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వ్యాధి విస్తరించకుండా వీర్య నిల్వ కేంద్రం వైద్యులు నివారణ చర్యలు చేపట్టినప్పటికీ ప్రజల్లో మాత్రం భయాందోళనలో తగ్గడం లేదు. ఇప్పటికే ఈ వ్యాధి సోకిన ఎనిమిది పశువులను, ఇద్దరు కార్మికులను క్వారంటైన్ కు తరలించి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. ఆబోతులు నుంచి తీసిన వీర్యాన్ని నిర్వీర్యం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. దాదాపు ఏడాది నుంచి సేకరించిన సుమారు 3.85 కోట్ల విలువైన ఒకటి. 28 లక్షల వీర్యం డోసులను నిర్వీర్యం చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా విస్తరించకుండా పరిసర గ్రామాల్లో కూడా పశువులకు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు.
వ్యాధిని ఎలా గుర్తించారంటే..
ప్రస్తుతం కర్నూలు జిల్లాలో భయాందోళన కలిగిస్తున్న ఈ వ్యాధిని ఎమ్మిగనూరు మండలం బనవాసి జెర్సీ పశు క్షేత్రంలో గుర్తించారు. ఈ పశు క్షేత్రాన్ని 1986లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ముర్రా జాతి సంతతి, జెర్సీ జాతి, హోల్ స్ట్రీమ్ ప్రీషిమన్ జాతి, క్రాస్ బ్రీడ్ జెర్సీ జాతి, సిబిహెచ్ఎఫ్ వంటి రకాల జాతులకు చెందిన 88 ఆవులు, గేదెలు జాతులకు చెందిన ఎద్దులు దున్నపోతులు ఉన్నాయ. వీటి నుంచి ఏటా దాదాపు 17 నుంచి 20 లక్షల వరకు డోసులకుపైగా వీర్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. వీటి ఆరోగ్యంపై అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుంటారు. క్రమం తప్పకుండా నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఇటీవల 88 పశువుల రక్త నమూనాలను బెంగుళూరులోని ఎస్సార్డిడిఎల్ ల్యాబ్ కు పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో జెర్సీ జాతికి చెందిన ఐదు ఎద్దులు, ముర్రా జాతికి చెందిన మూడు దున్నపోతులకు బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. వీటి సంరక్షణ కోసం పని చేస్తున్న కూలీల రక్త నమూనాలను కూడా పరీక్షలకు పంపగా ఇద్దరికీ బ్రూసెల్లోసిస్ నిర్ధారణ అయింది. దీంతో వీర్య నిల్వ కేంద్రం వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. బ్యాక్టీరియా సోకిన పశువులను కిలో మీటర్ దూరంలో క్వారంటైన్ ఉంచారు. ఇద్దరు కూలీలను కూడా ప్రత్యేక క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలను భయాందోళన చెందేలా చేస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
ఈ వ్యాధి వ్యాప్తి చెందడంపై ఆందోళన..
ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందన్న ప్రచారంతో స్థానిక ప్రజలు భయపడుతున్నారు. ఈ వ్యాధి బ్రూసెల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా ద్వారా బ్రూసెల్లోసిస్ వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది పశువుల నుంచి మనుషులు కూడా వ్యాపించే అంటు వ్యాధి. ఈ బ్యాక్టీరియా సోకిన జంతువుల నుంచి సేకరించిన పాశ్చరైజ్ చేయని (పచ్చి)పాలు, ఆ పాలతో చేసిన పన్నీరు, జున్ను వంటి పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అలాగే వ్యాధి సోకిన జంతువులు ఉన్న పరిసరాలు, పశువుల పాకల్లో గాలి ద్వారా బ్యాక్టీరియా మనుషుల శ్వాసలోకి ప్రవేశించి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి, చెమటలు పట్టడం, ఆయాసం, బరువు తగ్గడం, ఆకలి వేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన వారికి కీళ్ల నొప్పులు జీవితకాలం వేధించే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధి ముదురుతున్న కొద్ది కాలేయం, గుండె, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలోనే వైద్యులు కూడా అప్రమత్తమై ప్రజలను అలర్ట్ చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది.