HomeజాతీయంBengal Elections: బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. ఈసీ సంచలన నిర్ణయం!

Bengal Elections: బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. ఈసీ సంచలన నిర్ణయం!

పశ్చిమ బెంగాల్‌ లో జరగనున్న రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంచిత ఘటనలకు లేకుండా చూసేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌ కు చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల పరిశీలకుడిగా నియమించారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ గా గుర్తింపు చెందిన ఆయనకుప్రత్యేకంగా ఈ బాధ్యతలను అప్పగించింది.

ఈ నెల 29న బెంగాల్ రెండో విడత పోలింగ్

ఈ నెల 29న కోల్‌ కతా సహా దక్షిణ బెంగాల్ పరిధిలోని 142 నియోజకవర్గాల్లో రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రత, పర్యవేక్షణ అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన అజయ్ పాల్ శర్మ, తన సర్వీస్ లో కీలక ఆపరేషన్లలో పాల్గొని సత్తా చాటారు. అందుకే, ఆయనను ఈ ఎన్నికల బాధ్యతల్లోకి తీసుకొచ్చారు.

భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు

ఇక భద్రతా ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. మొత్తం ఏడు జిల్లాల్లో 2,300కి పైగా కేంద్ర బలగాల కంపెనీలను మోహరించారు. అదనంగా సాధారణ పరిశీలకులు, పోలీసు పరిశీలకులు, ఖర్చు పర్యవేక్షకులను కూడా నియమించారు. ప్రతి నియోజకవర్గంలో పరిస్థితులను సమీక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజా సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు. పోలింగ్ ప్రాంతాలపై నిరంతర నిఘా కోసం డ్రోన్ కెమెరాలను సిద్ధం చేశారు. ముఖ్యంగా కోల్‌ కతా నగరంలోనే అత్యధికంగా కేంద్ర బలగాలను మోహరించారు.

ఓటు హక్కు వినియోగించుకోనున్న 3 కోట్ల మంది  

ఈ విడతలో దాదాపు 3 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం సుమారు 41 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే, ఈసారి ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు