-
ఆహ్వాన పత్రికల్లో లేని పేరు
-
కుమారుడు చుట్టూ వివాదమే కారణం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఆహ్వానితుల జాబితాలో బండి సంజయ్ పేరు లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానితుల జాబితాలో బిజెపి ఎంపీలు సైతం ఉన్నారు. కానీ బండి సంజయ్ కు మాత్రం చోటు దక్కలేదు.
పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ఆయన కుమారుడు చుట్టూ కొత్త వివాదం నడుస్తున్న వేళ బీజేపీ హై కమాండ్ బండి సంజయ్ ను దూరం పెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చివరకు ఆహ్వానితుల జాబితాలో కాంగ్రెస్ ఎంపీలకు సైతం చోటు దక్కింది. బండి సంజయ్ పేరు లేకపోవడంతో ఆయన విషయంలో హై కమాండ్ సీరియస్ గా ఉన్నట్లు అర్థమవుతోంది.
కాంగ్రెస్ ఎంపీలకు సైతం…
హైదరాబాదులోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. కానీ ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు లేకపోవడం సంచలనంగా మారింది.
అయితే బండి సంజయ్ పేరు లేకపోవడానికి సంబంధించి రాష్ట్ర బిజెపికి ఎటువంటి సమాచారం లేదు. బండి సంజయ్ కుమారుడు ఓ మైనర్ బాలికను వేధించిన వ్యవహారం తెరపైకి రావడం.. ఫోక్ షో కేసు నమోదు చేయాలని డిమాండ్లు.. అదే సమయంలో అతనిపై హనీ ట్రాప్ జరిగినట్లు బిజెపి వర్గాలు చెప్పడం వంటి కారణాల నేపథ్యంలో బండి సంజయ్ ను ప్రధాని టూర్కు దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది.
ఎదుగుదల వెనుక సవాళ్లు…
సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు బండి సంజయ్. అయితే ఆయన వేసిన ప్రతి రాజకీయ అడుగు ఒక సవాలే. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీల్లోనూ ఆయనకు శత్రువులు ఉన్నారు. సొంత పార్టీలో సైతం వ్యతిరేకించే వారు ఉన్నారు. రాజకీయాల్లో ఎదుగుతున్న కొద్ది శత్రువులు కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉంటారు.
బండి సంజయ్ విషయంలో ఇది స్పష్టంగా అర్థం అవుతోంది. హనీ ట్రాప్ అని చెబుతున్నప్పటికీ.. పరిస్థితి ఎంత దాకా వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని పర్యటన వేళ ఈ ఘటన జరగడం వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానిస్తున్నారు బండి సంజయ్. మొత్తానికైతే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఇలా ఫ్యామిలీ మూలంగా ఇబ్బంది పడడం గమనార్హం.