తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ‘మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్’గా తీర్చిదిద్దుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే వినూత్న వ్యవస్థలను ఇక్కడ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.
ఈ నూతన సాంకేతిక విధానాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్వయంగా పరిశీలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఏఐ వ్యవస్థల పనితీరును క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ పర్యటనలో అడిషనల్ డీజీపీ అకున్ సబర్వాల్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా సేవలందించే విధానంలో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తొలిసారిగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఈ ఏఐ ఆధారిత సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఇక అధికారుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు!
సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు ఫిర్యాదు నమోదు చేయించుకోవడానికి సిబ్బంది అందుబాటులో ఉండే వరకు బాధితులు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే కొత్త ఏఐ విధానంతో ఈ ఇబ్బందులకు పరిష్కారం లభించనుంది. ఫిర్యాదుదారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏఐ యంత్రం ముందు నిలబడి తమ సమస్యను మౌఖికంగా వివరించవచ్చు. వారు చెప్పిన సమాచారాన్ని విశ్లేషించి, దాని ఆధారంగా ఫిర్యాదు పత్రాన్ని ఏఐ వ్యవస్థ రూపొందిస్తుంది.
అనంతరం సిద్ధమైన ఫిర్యాదు సంబంధిత పోలీస్ అధికారులకు ఆటోమేటిక్‌గా చేరుతుంది. దీంతో ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు, బాధితులు తమ సమస్యను సులభంగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖలో విస్తృతంగా వినియోగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పంజాగుట్టలో ప్రారంభించిన ఈ ప్రయోగాత్మక విధానం విజయవంతమైతే భవిష్యత్తులో పోలీస్ సేవల్లో మరిన్ని సాంకేతిక మార్పులకు మార్గం సుగమం కానుంది.
also read: సోషల్ మీడియా విమర్శలు పట్టించుకోను.. శోభిత నుంచి చాలా నేర్చుకున్నా: నాగచైతన్య
