తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, ఆకాశం మేఘావృతమైంది. నేడు ఉభయ రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) అందించిన సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో నేడు వానలు పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలోని శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోనూ నేడు వర్షాలు పడొచ్చని SDMA అంచనా వేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోనూ ద్రోణి ప్రభావంతో వాతావరణం పూర్తిగా మేఘావృతమై చల్లబడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) స్పష్టం చేసింది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వానలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.ఈ అకాల వర్షాల నేపథ్యంలో రైతులు మరియు సామాన్య ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా రైతులు సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారే అవకాశం ఉంది.
