-
వాయిదా వేయాలని మేధావుల డిమాండ్
-
రాష్ట్రంలో కరువు పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:వచ్చే నెలలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో పెట్టుబడుల సదస్సు సక్సెస్ అయిన నేపథ్యంలో తెలంగాణలో సైతం విజయవంతంగా పూర్తి చేసేందుకు నిర్ణయించింది. అయితే ఇప్పుడు మేధావుల రూపంలో ఈ సమ్మిట్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. డిసెంబరు 7, 9 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను తక్షణమే వాయిదా వేయాలని కోరుతూ 400 మందికి పైగా పౌర సమాజ నాయకులు, మేధావులు, పర్యావరణ వేత్తలు, విశ్రాంత ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం విశేషం.
ఇప్పటికే భారత్ సమ్మిట్…
పారిశ్రామిక సదస్సుకు సన్నాహక శిబిరంగా తెలంగాణ ప్రభుత్వం భారత్ సమ్మిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇది కాస్త రాజకీయ సదస్సుగా మారిపోయింది. కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా ప్రతినిధులు విమర్శలు చేయడంతో పక్కదారి పట్టింది. ఈ తరుణంలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు రంగం సిద్ధం అయింది. ఇంతలోనే మేధావుల ఫోరం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారుతుంది. ప్రొఫెసర్ శాంతా సిన్హా, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి, ఈఎన్ఎస్ శర్మ తదితరుల సంతకాలతో కూడిన తెలంగాణ పీపుల్స్ కోయిలేషన్ ఈ లేఖను విడుదల చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 365 మండలాలను ప్రభుత్వమే అధికారికంగా తీవ్ర కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కరువు…
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం కొనసాగుతోంది. ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడిపోతుంటే.. పాఠశాలలతో పాటు సంక్షేమ హాస్టల్లో మూతపడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీలో 4000 మంది అతిధుల కోసం ఫైవ్ స్టార్ ఆతిథ్యం పేరిట ప్రజాధనాన్ని, నీటితో పాటు విద్యుత్ వృధా చేయడం ఎంతవరకు సమంజసం అని లేఖలో మేధావులు ప్రశ్నించారు. కరువు సహాయక చర్యలపై దృష్టి సారించాల్సిన ఐఏఎస్ అధికారులను, యంత్రాంగాన్ని విదేశీ ప్రతినిధుల సేవలకు మళ్లించడాన్ని తప్పుపట్టారు. ఆడంబర వేడుకలు, సదస్సుల కంటే ప్రజల ప్రాణాలు, జీవనోపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ పీపుల్స్ కోయిలేషన్ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. కరువు తీవ్రత దృష్ట్యా తక్షణమే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని, పశుగ్రాసం, తాగునీరు, ఉపాధి కల్పన పై పూర్తిస్థాయిలో దృష్టి సారించి.. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు గ్లోబల్ సమ్మేట్ ను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు.
