-
చంద్రబాబును కలవడంపై అనుచిత కథనం
-
కుమార్తె వివాహ ఆహ్వానం పై వివాదం
-
జగన్ పై నిప్పులు చెరుగుతున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : రాష్ట్ర రాజకీయాల్లో సాక్షి పత్రికలో వచ్చిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు నాయుడును కలవడం పై సాక్షి దినపత్రికలో ఒక కథనం ప్రచురితం అయింది. ఇటీవల హైదరాబాదులో చంద్రబాబును కలిసిన షర్మిల తన కుమార్తె వివాహ శుభలేఖను అందజేశారు. అయితే ఒక్కరోజు విరామం తర్వాత సాక్షి పత్రికలో బాబుతో చెట్టాపట్టాల్ అనే శీర్షికతో ప్రచురితమైన వార్త తీవ్ర వివాదానికి దారితీసింది. ఆదివారం షర్మిల చంద్రబాబును కలిశారు. మంగళవారం ఈ కథనం వచ్చింది. మధ్యలో సోమవారం యాజమాన్య ఉన్నత స్థాయిలో సుదీర్ఘ చర్చలు జరిపి.. జగన్మోహన్ రెడ్డి అనుమతితోనే అత్యంత ఉద్దేశపూర్వకంగా ఈ కథనాన్ని ప్రచురించారు అని స్పష్టంగా అర్థం అవుతుంది.
షర్మిల తీవ్ర ఆవేదన…
అయితే ఈ కథనం శీర్షిక మొదలుకొని.. ప్రతి వాక్యం వరకు ఒక మహిళ నాయకురాలు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉందంటూ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లెలిపై.. అందులోనూ ఇంటిలో శుభకార్యం జరుగుతున్న సమయంలో ఇలాంటి రాతలు రాయిస్తారని ఎవరూ ఊహించలేదని సామాన్యులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దివంగత రాజశేఖరరెడ్డి సైతం తన బిడ్డల పెళ్లిళ్లకు చంద్రబాబును ఆహ్వానించారని గుర్తు చేస్తున్నారు షర్మిల మద్దతుదారులు. కేవలం రాజకీయ కక్షతో మానవ సంబంధాలను, సంస్కారాన్ని మంటగలిపారని విమర్శిస్తున్నారు. ఈ ఒక్క కథనం ద్వారా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఆలోచన విధానం, మానసిక స్థితి ఏ స్థాయికి వెళ్ళాయో ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుందని విపక్ష వర్గాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
సమర్ధించుకుంటున్న వైసీపీ…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఈ కథనాన్ని సమర్థించుకుంటున్నాయి. ఆ పార్టీ వర్గాలతో పాటు సాక్షి మీడియా ప్రతినిధులు ఈ విమర్శలను భిన్నమైన కోణంలో తిప్పుకొడుతున్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం మానేసి.. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని షర్మిల రాజకీయం చేస్తున్నారని.. చంద్రబాబుతో ఆమె తరచూ జరుగుతున్న భేటీల వెనుక ఉన్న రాజకీయ సమీకరణలను మాత్రమే తాము ఎత్తి చూద్దామని వైసిపి నేతలు సమర్థించుకుంటున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, విశ్లేషణలు సహజమని.. వాటిని వ్యక్తిగత అంశాలకు ముడిపెట్టి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యారోపణలు చేస్తున్నాయి. వావి వరసలు మరిచి, తండ్రి లాంటి వ్యక్తిని కలిస్తే.. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు ప్రచురించారని షర్మిల ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై షర్మిల సంధించిన సూటి ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో.. ఈ వివాదం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
