Homeతెలంగాణరేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం...! కోటి కుటుంబాల‌కు ఐదు ల‌క్ష‌ల బీమా.....

రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…! కోటి కుటుంబాల‌కు ఐదు ల‌క్ష‌ల బీమా…..

  • మహిళలకు ఉచిత చీరలు

  • నేతన్నలకు ఉపాధి కల్పన

  • నేడు సీఎం రేవంత్ శ్రీకారం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రతిష్టాత్మక పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తీసుకొస్తోంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 19న సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ పథకం అమలుపై సీఎం కీలక ఆదేశాలు జారీచేశారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా.. ఐదు లక్షల రూపాయల జీవిత బీమా రక్షణ కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

పొలిటికల్ గేమ్ చేంజర్ గా…

ఈ బీమా పథకం పొలిటికల్ గా ఒక గేమ్ చేంజర్ అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వేర్వేరుగా అమలవుతున్న అన్ని రకాల ప్రభుత్వ ప్రాయోజిత బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. వాటన్నింటినీ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంతో అనుసంధానించనున్నారు. దీనివల్ల పథకాల అమలులో పారదర్శకత పెరగడంతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించనుండగా.. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న కుటుంబ పెద్ద పేరుపై ఈ బీమా నమోదు చేస్తారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలతో పాటు లేని అర్హులైన కుటుంబాలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

సిద్దిపేట వేదికగా…

సిద్దిపేట వేదికగా ఈ బీమా పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామాలు/ పట్టణాల్లోని ప్రతి ఇంటికి ఇందిరమ్మ కమిటీ సభ్యులు, స్థానిక అధికారులు నేరుగా వెళ్లి లబ్ధిదారుల వివరాలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించనున్నారు. లబ్ధిదారుల ఎంపిక, నమోదు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నవంబర్ 19 నుంచి ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. సిరిసిల్ల సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నేత కార్మికులతో ప్రత్యేకంగా నేయించిన నాణ్యమైన, ఆకర్షణీయమైన కొత్త డిజైన్ చిలక పచ్చ రంగు, ఎరుపుజరీ అంచు చీరలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సుమారు కోటి మంది మహిళలకు ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఒకవైపు కుటుంబానికి 5 లక్షల బీమా రక్షణ, మరోవైపు మహిళలకు ఉచిత చీరల పంపిణీ, నేతన్నలకు ఉపాధి కల్పనతో నవంబర్ 19న తెలంగాణలో సంక్షేమ పండుగ వాతావరణం నెలకొంది.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు