Homeజాతీయం"సోషల్ మీడియా కూడా ఒక వ్యసనమే".. కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

“సోషల్ మీడియా కూడా ఒక వ్యసనమే”.. కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలకు అతిగా అలవాటు పడటం కూడా ఒక వ్యసనమేనని అభిప్రాయపడ్డారు. ఏ రకమైన వ్యసనమైనా మనిషి ఆలోచనా శక్తిని, చైతన్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన ‘మారు నినాద్-2026’ ఘోష్ శివిర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టీ, కాఫీలు కూడా వ్యసనాలుగా మారవచ్చు

వ్యసనం అనగానే కేవలం మత్తు పదార్థాలకే పరిమితం కావాల్సిన అవసరం లేదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ప్రతిరోజూ తీసుకునే టీ, కాఫీలకు కూడా అతిగా అలవాటు పడితే అవి వ్యసనాలుగా మారతాయని వివరించారు. అలాగే కులం, భాష, ప్రాంతం, రాష్ట్రం వంటి గుర్తింపుల పట్ల అతిగా మమకారం పెంచుకోవడం కూడా ఒక రకమైన వ్యసనమేనని అన్నారు. ఇలాంటి అలవాట్లు వ్యక్తుల ఆలోచనా విధానాన్ని పరిమితం చేయడంతో పాటు సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.

భారత్ ఎదుగుదలను అడ్డుకోవాలని కొన్ని శక్తుల ప్రయత్నం

దేశంలో విభేదాలు సృష్టించి సమాజాన్ని విడదీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని భగవత్ ఆరోపించారు. కులం, భాష, ప్రాంతం వంటి చిన్నచిన్న అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ప్రజల మధ్య దూరం పెంచుతున్నారని విమర్శించారు. ఈ విధానం బ్రిటిష్ పాలకులు అనుసరించిన ‘విభజించి పాలించు’ వ్యూహాన్ని గుర్తుకు తెస్తోందని వ్యాఖ్యానించారు.

భారత్ సరైన దిశలో అభివృద్ధి చెందుతోందని, ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదిగే సామర్థ్యం మన దేశానికి ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రపంచ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం భారత్ ఎదుగుదలకు ఆటంకాలు కలిగించాలని చూస్తున్నాయని ఆరోపించారు. బ్రిటిష్ పాలనలో భారతీయ సంప్రదాయ విద్యావ్యవస్థ దెబ్బతినడం, విదేశీ విధానాలు రుద్దబడటం వల్ల దేశం బలహీనపడిందని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు ఉండాలి

దేశాభివృద్ధికి ఐక్యత, క్రమశిక్షణ, నిస్వార్థ సేవ ఎంతో అవసరమని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. వ్యక్తిగత స్వార్థం, అహంకారం, పరస్పర విభేదాలను పక్కనపెట్టి ధర్మం, దేశ సేవే లక్ష్యంగా సమాజం ముందుకు సాగాలని సూచించారు. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో 25 నుంచి 100 మంది వరకు మంచి వ్యక్తిత్వం, నడవడిక కలిగిన నిస్వార్థ సేవకులు ఉండాలని ఆకాంక్షించారు.

తన ప్రసంగంలో మహాభారత యుద్ధాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కౌరవుల సైన్యంలో పెద్ద సంఖ్యలో సైనికులు, శక్తిమంతమైన యోధులు ఉన్నప్పటికీ వారిలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఓటమికి కారణమయ్యాయని గుర్తుచేశారు. మరోవైపు పాండవులు తక్కువ సైనిక బలంతో ఉన్నప్పటికీ ఐకమత్యంతో పోరాడి విజయం సాధించారని వివరించారు. సమాజంలోనూ ఇదే ఐక్యతా స్ఫూర్తి ఉండాలని, దేశ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మోహన్ భగవత్ సూచించారు.

also read: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో కీలక భేటీకి సిద్ధం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు