క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్‌లోని కొత్తపట్నం సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ఇప్పటికే నలుగురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో ఐదుగురి కోసం అధికారులు, సహాయక బృందాలు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 3వ తేదీన తమిళనాడుకు చెందిన మత్స్యకారులు నిజాంపట్నం నుంచి రామాయపట్నం వైపు బోటులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తపట్నం సమీపంలో సముద్రంలో అలల ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి సముద్రంలో బోల్తా పడింది. ఊహించని ఈ ప్రమాదంతో బోటులో ఉన్న తొమ్మిది మంది సముద్రంలో పడిపోయి గల్లంతయ్యారు.
ప్రమాదానికి గురైన బోటు కొత్తపట్నం తీరానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో సముద్రంపై తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బోటును పరిశీలించిన అనంతరం అది తమిళనాడులోని కాశీమేడ్ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల వివరాలను అధికారులు గుర్తించారు. వారి పేర్లు సూర్య (49), కుప్పన్ (48), మోహన్ (47), రాజేష్ (52), మురుగన్ (48), కుప్పుస్వామి (58), విజయ్‌కాంత్ (44), అరవింద్ (40), నారాయణ (57)గా వెల్లడించారు. వీరిలో సూర్య బోటు డ్రైవర్‌గా ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే నలుగురు మత్స్యకారుల మృతదేహాలు కొత్తపట్నం సముద్ర తీరానికి చేరుకోవడంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. మిగిలిన ఐదుగురి కోసం సహాయక సిబ్బంది సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నారు. బోటు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ప్రమాద సమయంలో ఏం జరిగిందనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఒకేసారి తొమ్మిది మంది మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకోవడం వారి కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. తమ వారి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతుండటంతో కొత్తపట్నం తీరంలో ఉత్కంఠ నెలకొంది. గల్లంతైన మిగిలిన మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
also read : ఢిల్లీలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు.. ఇద్దరు మృతి!
