కేరళలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కేవలం పోలీసుల దర్యాప్తుతోనే కాకుండా, ప్రజలను కూడా సైబర్ నేరాల నియంత్రణలో భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన కార్యక్రమానికి మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టిని ప్రచారకర్తగా నియమించింది. ఆయనకు ‘సైబర్ సెక్యూరిటీ కెప్టెన్’ బాధ్యతలు అప్పగించింది. శనివారం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.
‘క్లిక్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం
కేరళ హోంశాఖ పరిధిలోని రాష్ట్ర పోలీస్ సైబర్ వింగ్ ‘క్లిక్’ (CLICK – Community Led Initiative for Cyber Resilient Kerala) పేరుతో కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని హోంమంత్రి రమేశ్ చెన్నితల ప్రారంభించారు. సైబర్ నేరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం కంటే, ముందుగానే ప్రజల్లో అవగాహన పెంచి మోసాలను నివారించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. 2027 నాటికి కేరళను సైబర్ ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు.
యువత సైబర్ భద్రతకు నాయకత్వం వహించాలి: మమ్ముట్టి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మమ్ముట్టి.. సైబర్ నేరాల నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పిల్లలకు చిన్న వయసు నుంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించడం నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.
పిల్లలు ఏడ్చినప్పుడు లేదా మారాం చేసినప్పుడు వారిని శాంతపరిచేందుకు వెంటనే స్మార్ట్ఫోన్లు చేతికి ఇవ్వడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. మొబైల్ ఫోన్లను సరిగ్గా ఉపయోగించే అవగాహన, పరిపక్వత వచ్చే వరకు పిల్లలకు సాధారణ ఫీచర్ ఫోన్లు ఇవ్వడం మంచిదని సూచించారు.
ప్రతి కొత్త సాంకేతిక ఆవిష్కరణకు మంచి, చెడు అనే రెండు కోణాలు ఉంటాయని, ఇంటర్నెట్ కూడా అందుకు మినహాయింపు కాదని మమ్ముట్టి అన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో నకిలీ సమాచారంతో ప్రజలను మోసగించే ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ మోసాలను గుర్తించే సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన పది మంది విద్యార్థులకు ‘క్లిక్ కెప్టెన్’ క్యాప్‌లను మమ్ముట్టి అందజేశారు.
గత ఏడాది 54 వేలకుపైగా సైబర్ ఫిర్యాదులు
కేరళలో సైబర్ నేరాల తీవ్రతను వివరిస్తూ హోంమంత్రి రమేశ్ చెన్నితల కీలక వివరాలు వెల్లడించారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 54 వేలకు పైగా సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంపై సరైన అవగాహన లేని వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బలమైన పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేసుకోవాలని, మొబైల్ యాప్‌లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింక్‌లను తెరవకూడదని స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైన వారు ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.
అంతేకాకుండా నవంబర్ 3 నుంచి తన కార్యాలయ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయనున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
సైబర్ నేరాల నియంత్రణలో ప్రభుత్వంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా భాగస్వాములు కావాలనే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మమ్ముట్టి ప్రచారకర్తగా వ్యవహరించనున్న ఈ ‘క్లిక్’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో డిజిటల్ భద్రతపై అవగాహన మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
also read: 56 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో ఒమర్ అబ్దుల్లా కొత్త జీవితం!
