జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 56 ఏళ్ల వయసులో ఆయన ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఒమర్ అబ్దుల్లా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఈ వార్త రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో నిధి రజ్దాన్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న ఒమర్ అబ్దుల్లా.. తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు వెల్లడించారు. ‘‘నిన్నటి నుంచి కొత్త ప్రయాణం ప్రారంభమైంది’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిధి రజ్దాన్‌ను కూడా తన పోస్టులో ట్యాగ్ చేశారు. వివాహం జరిగిన మరుసటి రోజే ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించారు.
కాగా, ఒమర్ అబ్దుల్లా వ్యక్తిగత జీవితంలో గతంలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయన, తన భార్య పాయల్ అబ్దుల్లా మధ్య చాలాకాలంగా దూరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు ఇద్దరూ నిర్ణయించుకున్నారు. జులై 31న సుప్రీంకోర్టు వీరి విడాకుల ప్రక్రియకు అంగీకారం తెలిపింది. తమ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడంతో పాటు, ఒకరిపై మరొకరు దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా అంగీకరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు మంజూరు చేయాలని ఉమ్మడిగా కోర్టును ఆశ్రయించారు.
ఒమర్ అబ్దుల్లా, పాయల్ అబ్దుల్లా 1994లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 2009 నుంచి వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. 2011లో తమ మధ్య దూరం ఉన్న విషయాన్ని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
ఇలా మొదటి వివాహ బంధానికి చట్టపరంగా ముగింపు పలికిన కొన్ని నెలలకే నిధి రజ్దాన్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు ఒమర్ అబ్దుల్లా ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన సోషల్ మీడియా పోస్ట్‌పై పలువురు స్పందిస్తూ కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
also read: గౌరీ లంకేశ్ హత్య తర్వాతే అతనిలో మార్పు.. ప్రకాశ్‌రాజ్ రాజకీయ వ్యాఖ్యలపై పోనీ వర్మ క్లారిటీ!
