-
పండుగలు, ఈవెంట్లు పోయాయి
-
సేవ ముసుగులో రాజకీయం
-
ఫేక్ కథనాలతో కొత్త అస్త్రం
-
భాస్కరుడా నీకో దండం
క్రైమ్ మిర్రర్, మునుగోడు: ఆస్కార్ అవార్డుల స్ఫూర్తితో తన పేరు మీద తానే ‘భాస్కర్’ అవార్డ్స్ పెట్టుకుని.. తానే దర్శకత్వం వహించి నటించిన రేడియేటర్ అనే షార్ట్ ఫిలింకు అవార్డులు ఇచ్చుకుంటాడు ఓ వ్యక్తి. మొన్న ఆ మధ్యన వచ్చిన హిట్ చిత్రం అత్తారింటికి దారేదిలో, బ్రహ్మానందం తన మార్కు కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. ఇప్పుడు అదే మాదిరిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అదే పేరుతో ఒక వ్యక్తి హల్చల్ చేస్తున్నాడు. మునుగోడు సమస్యలు పరిష్కరించే వారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన మద్దతు ఉంటుందంటూ తెగేసి చెబుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఆ సమస్యలను పరిష్కరించకుంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలిపించుకుంటానని శపధం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ‘జనం’ మెచ్చే.. ‘జనం’ నచ్చేలా.. జనాన్ని ‘సాక్షిగా చెబుతూ.. ఓ పత్రికలో పతాక శీర్షికన కథనాలు రాయించుకుంటున్నారు. అలాగని ఆ పత్రిక అధికారిక ప్రచురణలో ఆ పేజీలు కనిపించవు. ఆ వార్తలు కనిపించవు. అక్కడ రిపోర్టర్ ను మాయ చేశారో.. లేకుంటే నచ్చినట్టు కంటెంట్ రాయించుకుని డిటిపి చేశారో అర్థం కావడం లేదు. కానీ సమాజ ఉద్ధారకుడు.. సమాజంలో అభ్యుదయ మార్పునకు నాంది అంటూ నిలువెత్తు ఫోటోలు పెట్టించుకుని గొప్ప ప్రచారానికి తెర తీశాడు.
అంతా కల్పితమే…
చేసిన పనులను చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ప్రజా సమస్యల పేరు చెప్పి.. వాటిపై పోరాటం అని ముసుగు వేసి.. సొంతంగా కంటెంట్ రాయించుకుని.. కొన్ని అనుమతి లేని పత్రికల పేరుతో పతాక శీర్షికల్లో కథనాలు రాయించుకుంటే.. కల్పితాలు సృష్టిస్తే.. దానిని ఏమనాలి? ఏమని వర్ణించాలి? మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అంటావు.. రాచకొండ ఎత్తిపోతల డిపిఆర్ సాధన అంటావు.. శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేయాలంటావు.. రానున్న రెండు మూడు నెలల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలు అంటావు.. చివరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బూచిగా చూపుతున్నావ్. అసలు ఏంటి నీ అజెండా? సంచలన అజెండా అంటే? తెర వెనుక ఉద్దేశం ఏంటి? అనే ప్రశ్న ఇప్పుడు నడుస్తోంది.
బయటపడిన రాజకీయ అజెండా …
పక్కా రాజకీయ అజెండా తోనే మునుగోడు లో అడుగు పెట్టావు అని అర్థం అవుతోంది. గులాబీ పార్టీ గొడుగు కిందకు చేరాలనుకున్నావ్. సాధ్యపడక పోయేసరికి అధికార పార్టీ దృష్టిలో పడాలనుకుంటున్నావ్. అందుకుగాను సేవ, కళ సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పండుగలు, దసరా ఈవెంట్లు.. ఇలా ఒక్క ప్రయత్నం తరువాత ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఆశించిన ఫలితం దక్కకపోయేసరికి చివరకు మీడియా తస్కరణ కూడా ప్రారంభించావు. జనం పేరుతో.. జనం సాక్షిగా అంటూ.. సంచలన ఈ జెండా అంటూ.. యువతకు ఉపాధి… రైతుకు సాగునీరు.. చేనేతకు హక్కులే శ్వాసగా సమర శంఖం పూరించి.. లక్ష్యం స్పష్టం అంటూ నినాదం.. చివరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ అంటూ ఇంటూ.. చాలు బాబు చాలు.. బ్రహ్మానందం ప్రకటించుకున్న ‘భాస్కర్’ అవార్డ్స్ కంటే.. నీ నటనకు ఎంత పెద్ద అవార్డులైన ఇవ్వచ్చు. అందుకు మీరు అర్హుడు కూడా.
ఇవి కూడ చదవండి:
-
ఏపీకి రెండు కేంద్ర బృందాలు.. తుపాను నష్టం, కరవు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన!
-
బోనీ కపూర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వెనుక అసలు కథ.. డబ్బులు కట్టకపోగా ఆయనే తీసుకున్నారట!
-
హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం.. జలమయమైన రహదారులు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్!
-
సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. ఒక్కొక్కరికి రూ.1.10 లక్షల బోనస్!
