Homeతెలంగాణఅంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా గుట్టురట్టు.. 25 తులాల బంగారం స్వాధీనం

అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా గుట్టురట్టు.. 25 తులాల బంగారం స్వాధీనం

క్రైమ్ మిర్రర్ : సోషల్ మీడియాను పరిచయాలకు వేదికగా మార్చుకుని, అదే మాధ్యమం ద్వారా చోరీలకు వ్యూహాలు రచిస్తున్న అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ మెసేజ్‌ల ద్వారా ఒకరికొకరు సమాచారం చేరవేసుకుంటూ రద్దీగా ఉండే బస్టాండ్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠా గుట్టును మెదక్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. నిజాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 30 తులాల బంగారు ఆభరణాల చోరీ కేసును ఛేదించి ఓ మహిళను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

బస్సు ప్రయాణంలో బంగారం మాయం..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సూరం స్నేహ గత ఆగస్టు 26న రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులో రామాయంపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి నిజాంపేటలోని తన పుట్టింటికి వెళ్లేందుకు మరో బస్సు ఎక్కారు. ప్రయాణ సమయంలో ఆమె బ్యాగులో భద్రపరిచిన సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని మహిళలు అపహరించారు. ఇంటికి చేరుకున్న తర్వాత నగలు కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ ఆధారంగా నిందితురాలి గుర్తింపు

ఈ చోరీ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడంతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించారు. దర్యాప్తులో మేకల సంధ్య అనే మహిళ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఆగస్టు 26న రామాయంపేట నుంచి నిజాంపేటకు వెళ్తున్న బస్సులో స్నేహ బ్యాగులోని బంగారాన్ని అపహరించి, మార్గమధ్యంలోనే బస్సు దిగి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఫేస్‌బుక్ మెసేజ్‌లతో చోరీల వ్యూహాలు

ఈ ముఠా సభ్యులు ఫేస్‌బుక్ ద్వారా పరస్పరం సందేశాలు పంపుకుంటూ చోరీలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేవారని పోలీసులు గుర్తించారు. రద్దీగా ఉండే బస్టాండ్లు, బస్సులను ఎంచుకుని మహిళా ప్రయాణికుల కదలికలను గమనించేవారు. వారి బ్యాగుల్లో ఉండే బంగారు నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవారని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

పలు నగరాల్లో చోరీల నెట్‌వర్క్..

హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, నిజామాబాద్, మెదక్ తదితర ప్రాంతాల్లోనూ ఈ ముఠా సభ్యులు చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ముఠాలోని ఏ-1 నిందితురాలు రాధికపై మూడు కేసులు, ఏ-2 నిందితురాలు అక్షింతల సంధ్యపై 20 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఠాలో ఒకరిని మినహాయిస్తే మిగిలిన వారంతా బంధువులేనని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మేకల సంధ్యను రామాయంపేట బస్టాండ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో మరో నలుగురు నిందితులు పరారీలో ఉండటంతో వారి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.

ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్సులు వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని, ప్రయాణ సమయంలో బ్యాగులపై నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, దొంగతనం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చోరీ కేసును ఛేదించి నిందితురాలిని అరెస్టు చేయడంతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
also read ‘; ఐడీబీఐ ఆస్తుల విలువ ఎంత…? కేంద్రాన్ని నిలదీసిన కేటీఆర్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు