-
రేవంత్ సర్కార్ పై గులాబీ పార్టీ అగ్రనేత విమర్శల వర్షం
-
గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై అభ్యంతరాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయం ముదురుతోంది. అధికార, విపక్షాల మధ్య గట్టి మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానంగా కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి చుట్టూ రాజకీయం తిరుగుతోంది. కానీ గులాబీ పార్టీ అగ్రనేత కేటీఆర్ కు మాత్రం కేవలం ఎల్ నినో, కరువు పరిస్థితులే రాజకీయ అస్త్రాలుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిన.. ఏ అభివృద్ధి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన.. వాటన్నింటికీ కరువును, ఎల్ నినో ప్రభావాలను ముడిపెడుతూ నిలదీయడమే ఆయన ప్రధాన అజెండాగా మార్చుకున్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధతగా చిత్రీకరిస్తూ.. ప్రతి ప్రభుత్వ చర్యను ప్రతికూల కోణంలో విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు అన్న భావన వ్యక్తం అవుతోంది.
సదస్సులు అవసరమా…?
హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ భారీ సదస్సు నిర్వహించేందుకు సిద్ధపడుతోంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్. గ్రామాల్లో తాగునీరు, సాగునీరు లేక రైతులు, ప్రజలు అల్లాడుతుంటే.. విలాసవంతమైన సదస్సులు, గ్లోబల్ సమ్మిట్లు నిర్వహించడం ఎందుకంటూ ఆయన నిలదీస్తున్నారు. ప్రభుత్వం కరువును ఎదుర్కోవడానికి నిధులు వెచ్చించకుండా.. ఆడంబరాలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తోందని ఆరోపిస్తున్నారు. కేటీఆర్ వాదనలను నిశితంగా గమనిస్తే.. రాష్ట్రంలో కరువు ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి ఇతర పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని.. అంతర్జాతీయ సదస్సులు, ఆర్థిక ప్రగతికి సంబంధించిన కార్యక్రమాలు అన్నింటినీ పూర్తిగా నిలిపివేయాలి అన్నట్లుగా ఆయన ధోరణి కనిపిస్తోంది.
కేటీఆర్ తీరుపై విమర్శలు…
దక్షిణాది రాష్ట్రాలకు ఎల్ నినో ప్రభావం తప్పదని ఎప్పటినుంచో హెచ్చరికలు వచ్చాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే.. కరువును సమర్థవంతంగా ఎదుర్కోవాలి తప్ప.. దాని పేరు చెప్పి మొత్తం పాలనను ఆపేసి చేతులు కట్టుకొని కూర్చోవాలి అంటూ కాంగ్రెస్ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. గత గులాబీ పార్టీ హయాంలో కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్లు కుమ్మరించి.. చివరకు ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చిన పాపం వారిదేనని మండిపడుతున్నారు. కరువు కాలంలో రైతులకు అండగా ఉంటూనే.. మరోవైపు రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుంటు పడకుండా పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం సమతుల్యతతో అడుగులు వేస్తోంది. కానీ సంక్షోభాన్ని సైతం రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడడం దివాలా కోరుతనమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దుయ్యబడుతున్నాయి. గత ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి కోలుకునేందుకు కేటీఆర్ కరువునే ప్రధాన రాజకీయ సాధనంగా మార్చుకున్నట్లు అర్థం అవుతుంది. సంక్షోభాల వేల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం సరైనదే. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధిని ఇచ్చే గ్లోబల్ సమ్మేటువంటి కార్యక్రమాలను కూడా కరువు బూచి చూపి అడ్డుకునేలా మాట్లాడడం సరైన చర్య కాదు.
ఇవి కూడ చదవండి:
- కొంపముంచిన కొండా దంపతుల దూకుడు…! దెబ్బ తింటున్న ప్రతిష్ట…
-
‘ఒమేగా’పై ఐటి గురి…!
-
ఏపీకి రెండు కేంద్ర బృందాలు.. తుపాను నష్టం, కరవు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన!
-
బోనీ కపూర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వెనుక అసలు కథ.. డబ్బులు కట్టకపోగా ఆయనే తీసుకున్నారట!
