Homeతెలంగాణబేగంపేటలో అండాల అక్రమ సేకరణ కలకలం.. గర్ల్స్ హాస్టల్‌పై పోలీసుల దాడులు

బేగంపేటలో అండాల అక్రమ సేకరణ కలకలం.. గర్ల్స్ హాస్టల్‌పై పోలీసుల దాడులు

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లో యువతుల అండాల సేకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన యువతులను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా అండాలు సేకరిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఓ గర్ల్స్ హాస్టల్‌పై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 8 నుంచి 10 మంది యువతులను గుర్తించి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక ఓ మహిళ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల సేకరణ?

వివరాల్లోకి వెళ్తే.. బేగంపేట పరిధిలోని ప్రకాశ్ నగర్‌లో ఉన్న నజ్రాన్ అపార్ట్‌మెంట్‌లో యువతుల నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. ఈ సమాచారాన్ని తీవ్రంగా పరిగణించిన బేగంపేట పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) సిబ్బందితో కలిసి అపార్ట్‌మెంట్‌పై సంయుక్తంగా దాడులు చేపట్టారు.

అక్కడ ‘అమీ నీతా గర్ల్స్ హాస్టల్’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఈ కేంద్రం ద్వారా గత ఏడాది కాలంగా అండాల సేకరణ వ్యవహారం కొనసాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు అక్కడ ఉన్న యువతుల వివరాలను సేకరించి విచారణ ప్రారంభించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతులే లక్ష్యమా?

పోలీసుల తనిఖీల సమయంలో బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన దాదాపు 8 నుంచి 10 మంది యువతులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. వీరిని అండాల సేకరణ కోసం తీసుకొచ్చారా? ఇందుకు ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు? యువతులకు ఈ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం ఇచ్చారా? వారి అనుమతి తీసుకున్నారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా యువతులకు డబ్బులు చెల్లించి అండాలు సేకరిస్తున్నారా? లేక ఇతర ప్రలోభాలకు గురిచేస్తున్నారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. అయితే యువతుల నుంచి అండాలు సేకరించినట్లు వచ్చిన ఆరోపణలు, వాటికి సంబంధించిన వాస్తవాలను దర్యాప్తు ద్వారా నిర్ధారించాల్సి ఉంది.

మహిళ అదుపులోకి.. సంతాన సాఫల్య కేంద్రాలతో సంబంధాలపై ఆరా

ఈ వ్యవహారంలో ఓ మహిళ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? యువతులను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అండాల సేకరణకు అవసరమైన వైద్య ప్రక్రియలను ఎక్కడ నిర్వహిస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సంతాన సాఫల్య కేంద్రాలకు (IVF సెంటర్లు) ఈ యువతుల అండాలను సరఫరా చేస్తున్నారా? అనే అంశంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అండాల సేకరణ, నిల్వ, విక్రయాలు లేదా సరఫరా వెనుక ఏదైనా నెట్‌వర్క్ పనిచేస్తోందా? ఇందులో మరికొందరి ప్రమేయం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

సీపీ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు

ఈ ఘటనను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఆమె ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. యువతుల నుంచి అండాలు సేకరించేందుకు అనుసరిస్తున్న విధానాలు, వాటికి సంబంధించిన వైద్య అనుమతులు, చట్టపరమైన నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు యువతుల భద్రత, వారి ఆరోగ్య పరిస్థితి, ఈ వ్యవహారంలో వారి ప్రమేయం లేదా వారు ఎదుర్కొన్న పరిస్థితులపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

అసలు నెట్‌వర్క్ ఎవరిది?

గర్ల్స్ హాస్టల్ పేరుతో కొనసాగినట్లు అనుమానిస్తున్న ఈ వ్యవహారం వెనుక అసలు సూత్రధారులు ఎవరనేది ఇప్పుడు కీలకంగా మారింది. యువతులను ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు? అండాలను సేకరించేందుకు ఎవరెవరు సహకరించారు? సంతాన సాఫల్య కేంద్రాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు లభించాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు, అండాల సేకరణ నిజంగా జరిగిందా? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? అనే విషయాలు అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడికానున్నాయి.
also read ; పార్కింగ్ స్థలం కోసం ముగ్గురి హత్య.. 22 సెకన్లలో ఐదు రౌండ్ల కాల్పులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు