హైదరాబాద్లో ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని స్వీట్ తయారీ కేంద్రాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. తెలంగాణ ఆహార భద్రతా విభాగం, నగర పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పలు ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. అపరిశుభ్ర వాతావరణం, ఎలుకల విసర్జనలు, గడువు ముగిసిన ఆహార నిల్వలు గుర్తించడంతో అధికారులు చర్యలు చేపట్టారు.
క్యూర్ రీజియన్ పరిధిలోని 16 ప్రముఖ స్వీట్ తయారీ కేంద్రాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ ప్రక్రియల్లో పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశాన్ని అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో కొన్ని కేంద్రాల్లో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు.
తనిఖీల్లో తీవ్రమైన లోపాలు బయటపడటంతో ఐదు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. మరో ఐదు సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని సుమారు 3,546 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని నాశనం చేశారు.
ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్వీట్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ, నిల్వలో పరిశుభ్రత పాటించకపోవడం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటుండటంతో ఆహార వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది.
also read: రణబీర్ కపూర్ ‘రామాయణం’పై భారీ అంచనాలు.. నవంబర్ 5న గ్రాండ్ రిలీజ్!
