Homeతెలంగాణమునుగోడు లక్కీ భాస్కర్...! అచ్చం సినిమా మాదిరిగానే తెర‌వెనుక గోల్‌మాల్‌..

మునుగోడు లక్కీ భాస్కర్…! అచ్చం సినిమా మాదిరిగానే తెర‌వెనుక గోల్‌మాల్‌..

  • ఒక్క మాటలో చెప్పాలంటే కేఏ పాల్.. అరచేతిలో వైకుంఠం..ఆపై విన్యాసాలు

  • గూట్ల రాయిని తియ్యనోడివి ఏట్ల రాయిని ఎలా తీస్తావు..!?

  • కన్నతల్లికి బువ్వ పెట్టనోడు.. పిన్న తల్లికి బంగారు గాజులా..!?

  • బీఆర్‌ఎస్‌ బంధానికి బ్రేక్‌.. కాంగ్రెస్‌ గూటికి చేరే వ్యూహం!?

  • ఫ్లోరోసిస్‌ బాధితుల కన్నీళ్లతో ప్రచారం?

  • ఉత్సవాల ఆడంబరం వెనుక రాజకీయ ఎత్తుగడ

  • మునుగోడు ఎమ్మెల్యే టికెట్టే లక్ష్యంగా పావులు..

  • గట్టుప్పల్‌ ఉత్సవాలతో రాజకీయ లెక్కలు

  • ఫౌండేషన్‌ ముసుగులో ఎన్నో లీలలు

నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): లక్కీ భాస్కర్..మొన్న ఆ మధ్యన వచ్చిన సూపర్ హిట్ చిత్రం. పనిచేసిన బ్యాంకునే బురిడీ కొట్టించడమే కాకుండా.. మోసగాళ్లకు మోసగాడు అన్నట్టు.. ఉన్నతాధికారుల అవినీతిని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా సొమ్ము కొట్టేయడం, తప్పు కాదు అని సందేశమిచ్చేలా సాగిన ఈ సినిమాలో లక్కీ భాస్కర్ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలా కొల్లగొట్టిన సొమ్ముతో ఏకంగా కుటుంబంతో విదేశాలకు చెక్కేస్తాడు లక్కీ భాస్కర్. అటువంటి లక్కీ భాస్కర్ ఇప్పుడు మునుగోడులో విన్యాసాలు చేస్తున్నాడు. అయితే ఈయన ఈఎల్వీ భాస్కర్. ఫౌండేషన్‌ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, భారీ సభలు, ప్రముఖుల సందడి, వాల్‌ పెయింటింగ్‌లతో ప్రచారం పెంచుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో మునుగోడు ఎమ్మెల్యే టికెట్‌ లక్ష్యంగా పునాది వేసుకుంటున్నారా? రాచకొండ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గట్టుప్పల్‌లో నిర్వహించిన, దసరా ఉత్సవాల నేపథ్యంలో ఈ ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.. ఇంట్ల గెల్వనోడు రచ్చ గెలుస్తాడ అన్నట్లు, పుట్టిన ఊరికి చెయ్యనోడు మునుగోడుకు ఏమి చేస్తాడు..! కన్నతల్లికి బువ్వ పెట్టనోడు.. పిన్న తల్లికి బంగారు గాజుల చేయించిన సామెతకు, ఏమాత్రం తేడా లేకుండా ఉన్నది భాస్కరుడి ప్రణాళిక అంటున్నారు అనేకులు..!? ప్రజల కష్టాల మీద, అభివృద్ధి కార్యక్రమాలపై కనీస అవగాహన, ప్రణాళికలు తెలియకుండా ఈ రాజకీయ ప్రవేశం కేవలం డబ్బు ఉందనే కారణమే అంటున్నారు పబ్లిక్..!?

బీఆర్‌ఎస్‌తో దోస్తీ.. ఇప్పుడు కాంగ్రెస్‌ వైపా…?

గతంలో బీఆర్‌ఎస్‌ నేతలతో సాన్నిహిత్యం కొనసాగిస్తూ, మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడం భాస్కర్‌ రాజకీయ వైఖరిపై సందేహాలకు తావిస్తోంది. గట్టుప్పల్‌ దసరా ఉత్సవాలకు ఆహ్వానించినప్పటికీ, బీఆర్‌ఎస్‌ నాయకులు ఒక్కరూ కూడా హాజరుకాలేదనే సమాచారం నేపథ్యంలో, ఆయన రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? ఆశించిన గుర్తింపు దక్కకపోవడంతో, కాంగ్రెస్‌ నాయకత్వం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారా? అన్న చర్చ కొనసాగుతోంది. అయితే ఆయన తదుపరి రాజకీయ నిర్ణయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఏ స్పష్టత లేని ఈఎల్వి భాస్కర్ మునుగోడుకు మరో కేఏపాల్ అని అనుకుంటున్నారు మునుగోడు ప్రజలు..!? రిజర్వాయర్ లెక్కలు, నీళ్లు ఎలా వస్తాయి అనే కనీస అవగాహన లేకుండా, కేవలం డబ్బు ఉందనే ఆలోచనతో, ఇష్టం వచ్చిన ప్రోగ్రాంలు పెడుతూ మునుగోడు ప్రజలను మోసం చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు..!? ఇనేండ్ల నుండి లేని భాస్కరా, ఇప్పుడు నీ రాజకీయం కోసమే మునుగోడుకు రాలేదా..!? ప్లోరైడ్ అంటున్నావు ఎక్కడుంది చూపించు.. రిజర్వాయర్ నిర్మాణం అంటున్నావు ప్రారంభించినప్పుడు ఏ ఊరిలో తలదాల్చుకున్నావు..!? భూ నిర్వాసితులు గొంతులు పోగా మొత్తుకొని, గుక్కపెట్టి ఏడ్చారు, అప్పుడు ఏడికి పోయావు అని ప్రజలు అడుగుతున్నారు.!? డబ్బుంటే ఎమ్మెల్యే అవుతావా.. ప్రజల కష్ట సుఖాలు తెలియని వ్యక్తి నేడు నీతులు చెబుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నదంటున్నారు నిపుణులు..!?

ఉత్సవాల ఆడంబరం.. బాధితులకు సాయమెక్కడ…?

యాంకర్లు, గాయకులు, హాస్యనటులు, ప్రముఖులతో భారీ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో గుర్తింపు రావచ్చు. కానీ ఫౌండేషన్‌ పేరుతో ప్రచారం చేసుకుంటున్నప్పుడు ఫ్లోరోసిస్‌ బాధితులకు అందించిన ఆర్థిక సహాయం ఎంత? శివన్నగూడెం రిజర్వాయర్‌ నిర్వాసితులకు చేసిన సాయమేమిటి? అన్న ప్రశ్నలపై ప్రజలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. గ్రామాలు, మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించడం, ఇతర ప్రాంతాలకు సైతం, వాల్‌ పెయింటింగ్‌ల ద్వారా ప్రచారం విస్తరించడం రాజకీయంగా గుర్తింపు పెంచుకునే ప్రయత్నమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ అవకాశం కోసం ఇంతటి ఖర్చు చేస్తున్నారా? ఫౌండేషన్‌ సేవలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారా? అన్న ప్రశ్నలకు భాస్కర్‌ స్పష్టత ఇవ్వాలి. రాజకీయాల్లోకి రావాలనుకుంటే బహిరంగంగా ప్రకటించాలి.. సేవపేరుతో రాజకీయ ప్రచారానికి తెరతీస్తున్నారనే అనుమానాలకు తావివ్వకూడదు.

ఇన్‌చార్జ్‌ల పనితీరుపై పర్యవేక్షణ ఏది…?

ఫౌండేషన్‌ తరఫున పనిచేస్తున్న మండల స్థాయి ఇన్‌చార్జ్‌లు, సహాయం పంపిణీలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారా? నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు, సహాయం పొందవచ్చిన వారిని ఇబ్బంది పెడుతున్నారని సమాచారం..! వినాయక చవితి సందర్భంగా కొన్ని మండపాలకే ఆర్థిక సహాయం అందించడంలో ప్రాతిపదిక ఏమిటి? ఇలాంటి నిర్ణయాలు స్థానిక యువత మధ్య విభేదాలకు కారణమవుతున్నాయనే కనీస జ్ఞానం లేదా అని అంటున్నారు గ్రామీణులు.!? సంస్థ పేరుతో పనిచేసే ప్రతినిధులపై పర్యవేక్షణ లేకపోతే సేవా లక్ష్యమే దెబ్బతింటుంది. ఫ్లోరోసిస్‌ బాధితుల కన్నీళ్లు, రిజర్వాయర్‌ నిర్వాసితుల ఆవేదన రాజకీయ ఎదుగుదలకు మెట్లుగా మారకూడదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎంత ముఖ్యమో, బాధితులకు అండగా నిలవడం కూడా అంతే ముఖ్యం. సభలతో గుర్తింపు రావచ్చు.. గోడలపై పేర్లు కనిపించవచ్చు.. కానీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించేది ప్రచారం కాదు, చేసిన సేవ మాత్రమే అని మరవద్దు. ఇంచార్జ్ ల పేరుతో మహిళపై వారు చూపిస్తున్నది ఆప్యాతనా లేక మరొక్కటా..!? కూర్చుంటే లేవని ఇలాంటి ఇంచార్జ్ లను పెట్టి, మునుగోడును ఎం చేద్దాం అనుకుంటున్నావు భాస్కరా..!

ఇవి కూడ చ‌ద‌వండి:

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు