Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో అర్నబ్ తుపాను బీభత్సం.. కేంద్ర బృందాలను పంపాలని అమిత్ షాకు చంద్రబాబు లేఖ!

ఏపీలో అర్నబ్ తుపాను బీభత్సం.. కేంద్ర బృందాలను పంపాలని అమిత్ షాకు చంద్రబాబు లేఖ!

ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను వెంటనే పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు లేఖ రాశారు. రాష్ట్రంలో తుపాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లిందని లేఖలో వివరించారు. సహాయక చర్యల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం

భారీ వర్షాలు, తుపాను తీవ్రత కారణంగా కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ నష్టం సంభవించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. మరో 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. తీర ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడంతో పాటు సుమారు 180 ఇళ్లకు నష్టం వాటిల్లింది. రహదారులపై 220కు పైగా చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

28 వేల మందికి పైగా ప్రజల తరలింపు

తుపాను ముప్పును ముందుగానే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇప్పటివరకు ప్రాణనష్టం జరగలేదని చంద్రబాబు తెలిపారు. ప్రభావిత 14 జిల్లాల్లో సహాయక చర్యల కోసం 16 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 28 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించినట్లు వివరించారు.

విద్యుత్, తాగునీటి పునరుద్ధరణపై దృష్టి

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు విద్యుత్, తాగునీటి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కూలిపోయిన చెట్ల తొలగింపు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల మరమ్మతులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగంగా చేపట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని వెల్లడించారు.

నష్టం అంచనాకు కేంద్ర బృందాల కోసం విజ్ఞప్తి

తుపాను వల్ల జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించేందుకు కేంద్ర బృందాలను వీలైనంత త్వరగా రాష్ట్రానికి పంపించాలని చంద్రబాబు నాయుడు అమిత్ షాను కోరారు. పూర్తి స్థాయి నష్టం అంచనా పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడం, బాధితులకు అవసరమైన సహాయం అందించడం, పంట నష్టాన్ని అంచనా వేయడం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి కీలకంగా మారాయి.

also read: సైబ‌ర్ నేరం సాదార‌ణ నేరం కాదు…! నేర‌గాళ్ల‌ను నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సిందే…! సుప్రీం కోర్టు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు