క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ కఠినంగానే ఉంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీని కాదని అధికారంలోకి రావడం అంటే పెద్ద సాహసం అనే భావిస్తోంది. దీనికి తోడు బిజెపి నేతల మధ్య సమన్వయం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. ప్రతి నేత ఊహల పల్లకిలో ఉన్నారు. విభేదాలకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్ పూర్తిస్థాయి ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన పార్టీ ముఖ్య నేతలు, పదాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాయకుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ వైఫల్యాలను, గులాబీ పార్టీ బలహీనతలను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో నాయకులు ఘోరంగా విఫలం అవుతున్నారు అని బన్సల్ మండిపడ్డారు. ప్రజల్లోకి వెళ్ళని నాయకులపై కాస్త గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా…
భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నారు. శక్తివంతమైన నేతలు సైతం ఆ పార్టీలో పనిచేస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఇక్కడ పార్టీ బలపడడం లేదు. కనీస స్థాయిలో ఊపు రావడం లేదు. అందుకే ఇంచార్జ్ బన్సల్ రంగంలోకి దిగారు. పనిచేస్తే చేయండి లేకుంటే తప్పుకోండి అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏ ఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదని.. ఉదయం లేస్తే పార్టీ రాష్ట్ర కార్యాలయం, మీడియా సమావేశాలు, హైదరాబాదులోని ఏసీ గదులకే పరిమితం అవుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు నడుపుతామంటే కుదరదని.. వెంటనే పల్లె బాట పట్టి బూత్ స్థాయి కమిటీల బలోపేతంపై దృష్టి సారించాలని హెచ్చరికలు జారీచేశారు. గతం నుంచి చాలామంది ఇన్చార్జిలు వచ్చారు కానీ బన్సల్ స్ట్రైట్ గా హెచ్చరికలు జారీ చేస్తుండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది బిజెపి నేతల్లో..
అప్పట్లో బండి సంజయ్ హయాంలో…
గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే తరహాలో కేంద్ర పెద్దలు కఠినంగా వ్యవహరించారు. స్వయంగా అమిత్ షా, జేపీ నడ్డా వంటి అగ్రనేతలు సైతం తెలంగాణలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ పోరుపై చాలా రకాల ఉపశమన చర్యలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీలను ఢిల్లీకి పిలిచి మరి చివాట్లు పెట్టారు. అయినా సరే వారి వైఖరిలో ఎంత మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఈ విషయంలో ముక్కుసూటిగా వెళ్తారని బన్సల్ కు మంచి పేరు ఉంది. ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన సమయంలోనే బిజెపికి మంచి రోజులు వచ్చాయి అనే టాక్ వినిపించింది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేయని నేతల జాబితాను బన్సల్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో తెలంగాణలో అమిత్ షా పర్యటించనున్నారు. మరోవైపు డిసెంబర్లో ప్రధాని రానున్నారు. ఆ సమయం నాటికి పూర్తిగా బిజెపిని అదుపులోకి తేవాలి అనేది బన్సల్ ఆలోచన. మరి ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
ఇవి కూడ చదవండి:
- జడ్జి కుమారుడి కారు బీభత్సం.. 55 ఏళ్ల వ్యక్తి దుర్మరణం
-
బాబాయ్ ఇంట్లో బంగారం చోరీ.. అమ్మి థార్ కొనుగోలు చేసిన యువకుడు!
-
కృష్ణా నదిలో నాటుపడవ బోల్తా.. ఇద్దరు యువకులు మృతి
-
బీహార్లో దారుణం.. ఏడాదిన్నర బాలుడిని హత్య చేసిన సొంత అన్న?
