Homeక్రైమ్కృష్ణా నదిలో నాటుపడవ బోల్తా.. ఇద్దరు యువకులు మృతి

కృష్ణా నదిలో నాటుపడవ బోల్తా.. ఇద్దరు యువకులు మృతి

క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం ప్రాతూరు సమీపంలో కృష్ణా నదిలో నాటుపడవ మునిగిపోవడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ప్రాతూరు గ్రామానికి చెందిన అర్జున్ (17), హర్ష (18)గా గుర్తించారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రాతూరు గ్రామానికి చెందిన ఈశ్వర్, సందీప్, సంతోష్, అర్జున్, హర్ష అనే ఐదుగురు స్నేహితులు శనివారం సరదాగా నాటుపడవపై నదీపాయను దాటి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో పడవలోకి నీరు చేరడంతో అది ఒక్కసారిగా మునిగిపోయింది. దీంతో ఐదుగురూ ప్రమాదంలో చిక్కుకున్నారు. సందీప్, సంతోష్, ఈశ్వర్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడగా.. అర్జున్, హర్ష నదిలో గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గ్రామస్థుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత గల్లంతైన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

దసరా సెలవులకు వచ్చి.. విగతజీవులుగా మారి

మృతుల్లో హర్ష తాడికొండలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవుల సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన అతడు ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హర్ష తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే మరణించినట్లు స్థానికులు తెలిపారు. అర్జున్ పదో తరగతి పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు నదిలో మునిగి మృతి చెందడంతో ప్రాతూరులో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
also read : బీహార్‌లో దారుణం.. ఏడాదిన్నర బాలుడిని హత్య చేసిన సొంత అన్న?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు