ముంబైలోని అనిక్ బస్ డిపో యార్డులో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ నిలిపి ఉంచిన 10 సీఎన్‌జీ ఏసీ మిడీ బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఈ బస్సులను దాగా గ్రూప్ నుంచి వెట్-లీజ్ విధానంలో తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మంటలు వేగంగా వ్యాపించడంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్లు, ఐదు వాటర్ ట్యాంకర్లతో సుమారు గంటకు పైగా తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీగా పొగలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఆందోళన నెలకొంది.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కూడా కాలేదని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించి, మంటలు ఎలా చెలరేగాయనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు.
also read: టొరంటో యూనివర్సిటీ భారీ స్కాలర్‌షిప్.. ఒక్కో పీహెచ్‌డీ విద్యార్థికి రూ.3 కోట్లకుపైగా!
