ఆధ్యాత్మిక నేపథ్యంతో రూపొందిన ‘హనుమాన్ అంశ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. విడుదలైన తర్వాత భారీ వసూళ్లను రాబడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సినిమా సిద్ధమైంది. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది.
అయితే ఈ సినిమా తెలుగు రిలీజ్ విషయంలో గతంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత సెప్టెంబర్ 18న తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు చెందిన ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ద్వారా తెలుగు వెర్షన్‌ను సమర్పించనున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే విడుదలకు సంబంధించిన డీల్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేయాలని కూడా ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమానికి సన్నాహాలు జరిగినప్పటికీ చివరి నిమిషంలో ఈ ఈవెంట్ రద్దయింది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ స్వయంగా తెలుగు వెర్షన్ విడుదల బాధ్యతలను చేపట్టడంతో అక్టోబర్ 9న రిలీజ్ ఖరారైంది.
తక్కువ బడ్జెట్.. భారీ వసూళ్లు
‘హనుమాన్ అంశ్’ సినిమాను దాదాపు రూ.1.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం. తక్కువ పెట్టుబడితో రూపొందిన ఈ చిత్రం వసూళ్ల విషయంలో మాత్రం అంచనాలను మించి దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 28 నాటికి భారత్‌లోనే రూ.300 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. విడుదలైన 52వ రోజుకు ఈ సినిమా ఈ మైలురాయిని చేరుకోవడం విశేషంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటే వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
నీమ్ కరోలి బాబా స్ఫూర్తితో కథ
ఆధ్యాత్మిక అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితంలోని అంశాల నుంచి ప్రేరణ పొందినట్లు చిత్రబృందం తెలిపింది.
కథ విషయానికి వస్తే.. లక్ష్మీ నారాయణ్ అనే వ్యక్తి సాధారణ జీవితం నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు ఎలా అడుగులు వేశాడు? అనంతరం ప్రముఖ సాధువుగా ఎలా మారాడు? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది. ఇందులో నీమ్ కరోలి బాబా పాత్రలో శోభినవ్ సత్యా నటించారు. విహాన్ షెదెగే, పూర్ణిమ తివారీతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.
ఇప్పటికే హిందీ సహా ఇతర భాషల్లో మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో టాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది.
also read: ప్రియుడితో ఉన్న మహిళపై లైంగిక దాడి.. సూత్రధారిగా వ్యవహరించింది ఎవరో తెలిస్తే షాక్!
