పహర్పూర్ పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఐదుగురు బాలికలు శుక్రవారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో స్థానికంగా ఉన్న చెరువు వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. వారిలో నలుగురు బాలికలు నీటిలోకి దిగగా, మరో బాలిక ఒడ్డునే ఉంది. నీటిలోకి వెళ్లిన బాలికలు చెరువు లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయారు.
తన కళ్ల ముందే నలుగురు బాలికలు నీటిలో మునిగిపోవడంతో ఒడ్డున ఉన్న బాలిక తీవ్ర భయాందోళనకు గురైంది. వెంటనే సమీపంలోని గ్రామస్థులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం గ్రామస్థులు, పోలీసులు కలిసి చెరువులో గాలింపు చేపట్టగా నలుగురు బాలికల మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. మృతులను సోనావతి కుమారి (13), ఫూల్వతి కుమారి (10), సోనాలి కుమారి (10), ప్రతిభా కుమారి (12)గా పోలీసులు గుర్తించారు. మృతులంతా 13 ఏళ్లలోపు బాలికలే కావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
మృతదేహాలను పోలీసులు స్థానిక మోతిమరి సర్దార్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తమ చిన్నారులు ఇక లేరన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత బాలికల మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా మెజిస్ట్రేట్ సౌరభ్ సుమన్ ప్రకటించారు. ఒకేసారి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో బంకాట్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
also read : సెల్ఫోన్ ఆశ చూపించి చిన్నారిపై లైంగిక దాడి.. నిందితుడు పరారీ
