-
ఎన్నికల సంస్కరణలపై హస్తం రివర్స్..
-
తాము ప్రవేశపెట్టిన ఈవీఎంలపైనే అనుమానం
-
గెలిచినప్పుడు లేని అభ్యంతరాలు.. ఇప్పుడు కొత్తగా.
-
సరికాదంటున్న విశ్లేషకులు
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: ప్రతి దేశంలో ఎన్నికల ప్రక్రియ సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. మనదేశంలో కూడా ఎన్నికల కమిషన్ సంస్కరణల దిశగా అడుగులు వేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో కాలంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని, పారదర్శకతను పెంపొందించేందుకుగాను ఈ సంస్కరణలను ఆహ్వానించాల్సిందే.
కానీ కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమి మాత్రం.. దశాబ్దాల కాలంనాటి పాత పద్ధతులు వైపు మళ్లాలని డిమాండ్ చేస్తోంది. పాత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని.. ఆధునిక ఈవీఎంలను పక్కనపెట్టి.. మళ్లీ కాగితపు బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపాలని కాంగ్రెస్ పట్టుపడుతోంది.
అయితే ఇది రాజ్యాంగబద్ధ పోరాటంగా చెబుతోంది కానీ.. అందులో ఉండే డొల్లతనం బయటపెడుతోంది. భారతదేశంలో ఎన్నికల వ్యవస్థను ఆధునికరించే క్రమంలో ఈవీఎం సాంకేతికతను స్వయంగా ప్రవేశపెట్టింది కాంగ్రెస్.
కానీ ఆ విషయాన్ని మరిచిపోయి మరి ఆ పార్టీ యూటర్న్ తీసుకొని ఈ వాదనను తీసుకురావడం సహేతుకం కాదు. తమ పార్టీ గెలిచినన్ని రోజులు అద్భుతంగా పనిచేసిన వ్యవస్థలు, వరుసగా అపజయాలు ఎదురవుతుండడంతో అకస్మాత్తుగా కుట్రలుగా మారిపోయాయని నమ్మించాలని భావిస్తోంది.
-
సర్ ప్రక్రియను సైతం..
ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళన చేస్తోంది ఎన్నికల సంఘం. దీనిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి. దొంగ ఓట్లు, డూప్లికేట్ ఎంట్రీలు, మరణించిన వారి పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను సరి చేయడం వల్ల వచ్చే సాంకేతిక సమస్యలు ఏంటో కాంగ్రెస్ స్పష్టంగా చెప్పలేకపోతోంది.
నిజంగానే ఓటర్ల జాబితా ప్రక్షాళన వల్ల అర్హులైన పౌరులు ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉంటే.. సదరు బాధితులను నేరుగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువచ్చి.. ఆధారాలతో సహా భారీ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించే వెసులుబాటు ప్రతిపక్షాలకు ఉంది.
ఓట్లు కోల్పోయిన అసలు వ్యక్తులు ఎవరో క్షేత్రస్థాయిలో చూపించకుండా.. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేయడం ప్రజల్లో విశ్వసనీయతను పెంచదు. కేవలం ఆరోపణలకే పరిమితమై.. పాత జాబితాలనే కొనసాగించాలని పట్టుబడడం వెనుక బోగస్ ఓట్లు కాపాడుకోవాలనే తాపత్రయమే ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
-
పాత ఓటర్ల జాబితాతోను ఓటమి..
పాత ఓటర్ల జాబితాలు అమల్లో ఉన్న కాలంలోనే కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓడిపోతూ వస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ మరిచిపోతోంది. ఒక వ్యవస్థ పరిపూర్ణంగా ఉన్నప్పుడే గెలుస్తాం.. లేకపోతే ఓడిపోతాం అనుకోవడం రాజకీయ పరిణితిని అనిపించుకోదు.
ఓటమికి అసలు కారణమైన ప్రజాదరణ లేమిని, బలహీనమైన క్యాడర్ నిర్వహణను సమీక్షించుకోవడానికి బదులుగా.. ప్రతిసారి ఎన్నికల సాంకేతికతను, ఓటర్ల సవరణ ప్రక్రియను విలన్లుగా చిత్రీకరించడం ద్వారా తమ నైరస్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తీర్పు ఇచ్చేది ఓటర్ల జాబితా పరిమాణాన్ని చూసి కాదు. పార్టీల నాయకత్వం పై ఉన్న నమ్మకాన్ని చూసి మాత్రమే నన్న నిజమైన సత్యాన్ని కాంగ్రెస్ గుర్తించలేకపోతోంది.
