-
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి నిరసనలు
-
మద్దతు తెలపనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
-
కేంద్ర పెద్దలతో చివరి సంబంధాలు కూడా తెంచుకునేందుకు వైసిపి అధినేత సిద్ధం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: జాతీయస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో కూడా లేదు. ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి అనుకూలంగా ఉండేది ఆ పార్టీ. నేరుగా స్నేహం చేసే పరిస్థితి లేదు కానీ తెర వెనుక మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది. కేంద్రానికి సంబంధించి కీలక బిల్లుల విషయంలో తమ మద్దతును బాహటంగానే ప్రకటించింది.
గత రెండు సంవత్సరాలుగా కూడా తమ పరిమిత బలంతో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడింది. అయితే గతం మాదిరిగా కేంద్ర బీజేపీ నుంచి జగన్మోహన్ రెడ్డికి సరైన సహకారం లభించడం లేదు. ఆపై అదే బిజెపితో జత కట్టిన చంద్రబాబుకు కేంద్ర పెద్దలు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. మరోసారి కూటమి గాని ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు.
ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఆయన ఇప్పుడు ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో.. ఆ కూటమి చేపట్టబోయే నిరసనల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాల్గొబోతున్నట్లు ప్రచారం ప్రారంభం అయ్యింది.
-
సేవ్ డెమోక్రసీ ఉద్యమానికి మద్దతు..
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును ప్రశ్నిస్తూ.. సేవ్ డెమోక్రసీ ఉద్యమం చేపడుతున్న సంగతి తెలిసిందే. జాతీయస్థాయిలో ఇది సంచలనంగా మారుతోంది. అయితే ఈ కూటమి నిరసనల్లో వైయస్సార్సీపి పాల్గొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
2024 ఎన్నికల ఫలితాల అనంతరం జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ ప్రధాన కారణం అంటూ వాదిస్తూ వచ్చారు. ఇటీవల ఈసీ తీరును, ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పుపడుతూ రాహుల్ గాంధీతో సహా విపక్ష నేతలు లేవనెత్తిన అనుమానాలకు పరోక్షంగా మద్దతు పలికారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఈ ఉద్యమానికి బాసటగా వైసీపీ నిలుస్తుందన్న సంకేతాలను పంపించారు.
-
ఒకరకంగా సంకట పరిస్థితి..
అయితే ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవేళ ఇండియా కూటమి ఆందోళన కార్యక్రమాలకు హాజరు కాకుంటే.. ఇన్ని రోజులు ఈవీఎంల వల్ల ఓడిపోయామన్నమాట గాలిలో కొట్టుకుపోతుంది. ఒకవేళ ఇండియా కూటమితో కలిసి పోరాటం చేస్తే రాజకీయంగా సరికొత్త కోణాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
అయితే చాలాసార్లు ఈవీఎంల పనితీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు, ఫిర్యాదులు చేసింది వైసిపి. అందుకే ఇప్పుడు తప్పకుండా వైసిపి ఆ నిరసనకు మద్దతు తెలపాలి.
మరోవైపు సందిగ్ధ స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని తమ వైపు తిప్పుకునేందుకు జాతీయ విపక్షాలు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు గాని జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు వెళ్లక పోతే భవిష్యత్తులో ఒంటరి కావడం ఖాయం.
-
న్యాయ చిక్కుముడులు తప్పవా..
తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి రాజకీయ, న్యాయపరమైన చిక్కుముడుల్లో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదేళ్ల పాలనలో కేంద్రంలోని బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి దాదాపు అన్ని బిల్లులు, విధానపరమైన నిర్ణయాల్లో మద్దతు ఇచ్చింది.
అయితే ఇప్పుడు ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తే మాత్రం బిజెపి అగ్రనాయకత్వంతో ఉన్న చివరి సంబంధాలు కూడా పూర్తిగా పెంచుకున్నట్లు అవుతుంది. ప్రస్తుతం సీబీఐతో పాటు ఈడీ కేసులు కొనసాగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడుగులు వేయరు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
