-
భూ వివాదాలకు ఎప్పుడు తెరపడేను?.. 22-A బాధితులకు పరిష్కారం ఎప్పుడో?
-
నిషేధిత జాబితాపై రగిలిన రగడ.. కేటీఆర్ జ్యుడీషియల్ విచారణ డిమాండ్
-
ఎర్రవల్లి భూములపై విచారణ.. రేవంత్ నిర్ణయంతో మరింత వేడెక్కిన రాజకీయం
-
అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటనలు.. కేసీఆర్ కుటుంబ భూములపైనా విచారణ
-
వేలాది మంది భూ యజమానులకు ఎప్పుడు పరిష్కారం?
హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: తెలంగాణ రాజకీయాల్లో భూముల వ్యవహారం మరోసారి కేంద్రబిందువుగా మారింది. 22-A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. ఈ అంశం నేరుగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ భూముల వరకూ వెళ్లింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాల్లో భూ అంశం మరింత వేడెక్కింది.
22-A అసలు సమస్యేంటి…?
రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A కింద కొన్ని రకాల భూములను రిజిస్ట్రేషన్‌కు నిషేధిత జాబితాలో ఉంచుతారు. అయితే ఈ జాబితాలో ప్రైవేట్ పట్టా భూములు కూడా చేరడంతో అనేక మంది యజమానులు తమ ఆస్తులను విక్రయించుకోలేక, రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది ప్రధాన వివాదం. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 22-A పరిధిలో దాదాపు 98 లక్షల ఎకరాలు ఉన్నాయని, అందులో ప్రైవేట్ పట్టా భూముల అంశం సుమారు 3.73 లక్షల ఎకరాలకు సంబంధించినదని ప్రభుత్వం పేర్కొంది. గతంతో పోలిస్తే నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్ పట్టా భూముల విస్తీర్ణం తగ్గిందని సీఎం తెలిపారు.
కేటీఆర్ డిమాండ్ ఏమిటి…?
22-A వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు చేరడం, రికార్డుల నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ కోరుతోంది. ఇక రేవంత్‌రెడ్డి మాత్రం సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వివిధ రకాల భూ సమస్యలకు ప్రత్యేక విధానాలు తీసుకొస్తామని తెలిపారు.
ఎర్రవల్లి ఎపిసోడ్ ఎంట్రీ…
ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లోని భూములపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సుమారు 700 ఎకరాల భూముల హక్కులు, అందులో ప్రభుత్వ భూమి ఎంత ఉందన్న అంశాన్ని అధికారులు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో 22-A సమస్య కేవలం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకే పరిమితమైన అంశంగా కాకుండా.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పెద్ద రాజకీయ పోరుగా మారింది.
ముందున్న అసలు ప్రశ్న…
భూముల రికార్డుల్లో తప్పులు జరిగాయా? జరిగితే బాధ్యత ఎవరిది? నిషేధిత జాబితాలో ఉన్న నిజమైన ప్రైవేట్ భూములకు ఎప్పుడు విముక్తి లభిస్తుంది? గత ప్రభుత్వ నిర్ణయాలకు, ప్రస్తుత అధికారుల చర్యలకు మధ్య బాధ్యత ఎలా నిర్ణయిస్తారు? ఇవే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రశ్నలుగా మారాయి. ఒకవైపు ప్రభుత్వం పరిష్కారం కోసం కమిటీలు, కొత్త విధానాలను ప్రకటిస్తుండగా.. మరోవైపు బీఆర్ఎస్ న్యాయ విచారణను కోరుతోంది. దీంతో 22-A వివాదం రాబోయే రోజుల్లోనూ తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా కొనసాగే అవకాశం ఉంది.
ఇవి కూడ చదవండి:
-
క్యాన్సర్ మందుల పేరిట భారీ దోపిడీ.. సుప్రీం కోర్టు సీరియస్!
-
తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సర్బూజుగా ఏర్పాట్లు: విద్యార్థుల వివరాలు సరిచూసుకోవాలని స్కూల్ హెచ్ఎంలకు కీలక ఆదేశాలు!
-
ఒక్కసారిగా మారిన వాతావరణం… హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం!
-
వైభవంగా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక.. విజేతలకు అవార్డులు అందజేసిన రాష్ట్రపతి!
