క్రైమ్ మిర్రర్ : దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. కేసుకు సంబంధించి 5,053 పేజీల ఛార్జిషీట్‌ను శనివారం పుణె కోర్టులో సమర్పించారు. హత్యకు ముందు జరిగిన పరిణామాలు, నిందితుల కుట్ర, దాన్ని అమలు చేసిన విధానాన్ని పోలీసులు ఛార్జిషీట్లో వివరించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 25 ఏళ్ల కేతన్ అగర్వాల్‌కు 20 ఏళ్ల సియా గోయల్‌తో వివాహం నిశ్చయమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరి నిశ్చితార్థం జరగగా, నవంబర్‌లో జైపూర్‌లో వివాహం జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కేతన్‌ను పెళ్లి చేసుకోవడం సియాకు ఇష్టం లేదని, ఈ కారణంగానే అతడిని హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు ఆరోపించారు.
ఈ కేసులో సియా గోయల్‌తో పాటు ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, రితేష్ హంగే కలిసి హత్యకు ప్రణాళిక రూపొందించినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. కేతన్కు పరిచయం ఉన్న ఓ యువతి ఫొటోను ఉపయోగించి ‘మాహి’ పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఖాతా ద్వారా కేతన్‌తో పరిచయం పెంచుకుని చాటింగ్ చేసినట్లు వెల్లడించారు.
జూన్ 18న లోహగడ్ కోట వద్ద సియాకు ముందస్తు పుట్టినరోజు సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు నమ్మించి కేతన్‌ను అక్కడికి రప్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం కోటపై నుంచి తోసివేయడంతో అతడు మృతి చెందినట్లు ఛార్జిషీట్లో వివరించారు. అయితే ఈ హత్యకు జూన్ 14నే అదే ప్రాంతంలో ప్రయత్నించినప్పటికీ అది విఫలమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సియా, చేతన్, రితేష్ హంగేలను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఐదుగురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 100 మందికి పైగా వ్యక్తుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్ డేటా, వాట్సాప్ సంభాషణలు, ఫొటోలు, కాల్ రికార్డులు తదితర ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు.
also read : మేము అధికారంలో ఉన్నంతవరకు అవనీతి జరగదు : సీఎం చంద్రబాబు
