తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘సిగ్మా’తో జేసన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక మీడియా సమావేశం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా జేసన్ సంజయ్ తన సినీ ప్రయాణం గురించి పలు విషయాలను వెల్లడించాడు. విదేశాల్లో స్క్రీన్ రైటింగ్, దర్శకత్వానికి సంబంధించిన కోర్సులు పూర్తి చేసినట్లు తెలిపాడు. సినిమా నిర్మాణంలో కీలకమైన 24 క్రాఫ్ట్స్‌పై అవగాహన పెంచుకున్నానని చెప్పాడు. దర్శకుడిగా తన తొలి అడుగులో తండ్రి విజయ్ అందించిన ప్రోత్సాహం ఎంతో ప్రత్యేకమని, దాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని జేసన్ పేర్కొన్నాడు.
‘మైఖేల్’ సినిమాలో సందీప్ కిషన్ నటన తనను ఆకట్టుకుందని జేసన్ చెప్పాడు. ఆ కారణంగానే ‘సిగ్మా’ కథకు ఆయన సరిపోతారని భావించి కథానాయకుడిగా ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమాను థియేటర్‌లో చూసేందుకు తన తండ్రి విజయ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని జేసన్ తెలిపాడు.
ఇక ‘సిగ్మా’లో సందీప్ కిషన్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ఈ చిత్రం తనకు తొలి తమిళ ప్రాజెక్ట్ అయినప్పటికీ.. పాత్రకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్లు ఫరియా వెల్లడించింది.
మరోవైపు ‘సిగ్మా’ కథ, కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని సందీప్ కిషన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
also read: సమంత కొత్త జర్నీ.. గర్భంతోనే ‘మాస్టర్‌చెఫ్ తమిళ్’ షూటింగ్
