మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత చామకూర మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఫ్లెక్సీల వ్యవహారం మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయ చర్చకు దారితీసింది. మల్లారెడ్డి కోడలు, డాక్టర్ ప్రీతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఐడీపీఎల్, సుచిత్ర ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేసిన శుభాకాంక్షల ఫ్లెక్సీలపై స్థానిక బీఆర్‌ఎస్ శ్రేణుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఫ్లెక్సీల్లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫొటోలు లేకపోవడాన్ని కొందరు పార్టీ కార్యకర్తలు తప్పుబట్టారు. బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన నేతల చిత్రాలను విస్మరించి, కేవలం మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఫొటోలకు ప్రాధాన్యం ఇవ్వడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు బీఆర్‌ఎస్ కార్యకర్తలు చించివేసి నిరసన తెలిపారు. పార్టీ క్రమశిక్షణను పాటించాల్సిన అవసరం ఉందంటూ వారు వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి వ్యవహారశైలిపై కూడా కార్యకర్తలు విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించినట్లు సమాచారం.
మరోవైపు ప్రీతిరెడ్డి అభిమానులు, మద్దతుదారులు ఈ చర్యలను తప్పుబట్టారు. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసిన శుభాకాంక్షల ఫ్లెక్సీలను పార్టీ రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని వారు పేర్కొన్నారు. వ్యక్తిగత అభిమానం, రాజకీయ పార్టీ వ్యవహారాలను వేర్వేరుగా చూడాలని సూచించారు.
ఇటీవల మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో మల్లారెడ్డి వర్గానికి, స్థానిక బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. తాజాగా ప్రీతిరెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీల వివాదం మరోసారి ఆ విభేదాలను తెరపైకి తీసుకొచ్చినట్లైంది.
also read: తండ్రి ఆస్తిలో కూతురికి ఎంత హక్కు? కొడుకుతో సమాన వాటా.. కానీ ఈ ఆస్తికి మాత్రం వర్తించదు!
