క్రైమ్ మిర్రర్ : కాన్పూర్‌కు చెందిన ఫార్మా వ్యాపారి వినీత్ మనోచా హత్య కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షూటర్ విశాల్ గౌతమ్.. హతుడి కుమారుడు సుబ్రత్‌కు పలుమార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో హత్య ఘటనలో సుబ్రత్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
సెప్టెంబర్ 5న వినీత్ మనోచా హత్యకు గురయ్యారు. అయితే ఘటనకు రెండు రోజుల ముందే విశాల్ గౌతమ్ కొత్త సిమ్ కార్డు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ నుంచే సుబ్రత్‌కు ఆరు కాల్స్ వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా అదే నంబర్ ద్వారా వినీత్ కోడలు షాలుతో కూడా విశాల్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
హత్య కోసం ప్రత్యేకంగా తీసుకున్నట్లు భావిస్తున్న సిమ్ నుంచి సుబ్రత్‌కు ఎందుకు ఫోన్ కాల్స్ వెళ్లాయి? వారి మధ్య ఏం చర్చ జరిగింది? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ తెలిపారు. మే 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు సుబ్రత్, షాలు, విశాల్‌కు సంబంధించిన ఏడు మొబైల్ నంబర్ల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కాల్ రికార్డుల్లో మే 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు సుబ్రత్, విశాల్ మధ్య ఏకంగా 309 సార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఈ కేసులో ఇప్పటికే వినీత్ కోడలు షాలు, షూటర్ విశాల్ గౌతమ్, అతని స్నేహితుడు రాజ్ కిశోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాలు చెప్పడంతోనే వినీత్‌ను హత్య చేసినట్లు విశాల్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా రూ.6 లక్షలు నగదుతో పాటు ఉద్యోగం ఇస్తానని షాలు హామీ ఇచ్చినట్లు అతడి వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం షాలు, విశాల్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి విచారణ పూర్తయిన తర్వాత సుబ్రత్‌ను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు కుటుంబ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, 2022లో రాసిన వీలునామా, సుబ్రత్‌పై ఉన్న అప్పుల వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో వినీత్ మనోచా హత్య వెనుక అసలు కారణం ఏమిటి? కుటుంబ సభ్యుల్లో ఇంకెవరైనా ఈ కుట్రలో భాగమయ్యారా? అనే ప్రశ్నలకు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
also read : కుటుంబ పోషణ కష్టంగా ఉంది.. ఆర్థిక ఇబ్బందుల్లో ఇమ్మంది రవి
