HomeUncategorized10 సెంట్ల నాణెం.. ఇప్పుడు రూ.10 కోట్లకు పైగా! అసలు దీని వెనుక కథేంటి?

10 సెంట్ల నాణెం.. ఇప్పుడు రూ.10 కోట్లకు పైగా! అసలు దీని వెనుక కథేంటి?

ఒకప్పుడు కేవలం 10 సెంట్లు విలువ చేసిన ఓ చిన్న నాణెం.. ఇప్పుడు ఏకంగా కోట్ల రూపాయల ధర పలికింది. అమెరికాకు చెందిన అత్యంత అరుదైన ‘1894-ఎస్ బార్బర్ డైమ్’ నాణెం తాజాగా జరిగిన వేలంలో 1,250,500 డాలర్లకు అమ్ముడైంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.10.4 కోట్లు. సెప్టెంబర్ 1న ‘స్టాక్స్ బోవర్స్ గ్యాలరీస్’ నిర్వహించిన వేలంలో పురాతన నాణేల సేకరణకారుల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. చివరకు ఓ వ్యక్తి ఈ అరుదైన నాణేన్ని సొంతం చేసుకున్నారు.

కేవలం 24 నాణేలే తయారీ

ఈ నాణేనికి ఇంత భారీ ధర రావడానికి ప్రధాన కారణం దాని అరుదైనదనం. 1894 జూన్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో మింట్‌లో బార్బర్ డైమ్ డిజైన్‌తో కేవలం 24 నాణేలు మాత్రమే తయారయ్యాయి. వాటిలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 9 నాణేలు మాత్రమే మిగిలి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇది అమెరికాలోని అరుదైన, విలువైన నాణేలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

నాణెం ముందు భాగంలో ‘లిబర్టీ’ చిత్రం ఉంటుంది. వెనుకవైపు పూలదండ మధ్యలో ‘వన్ డైమ్’ అనే అక్షరాలు, కింద భాగంలో శాన్‌ఫ్రాన్సిస్కో మింట్‌కు సంబంధించిన ‘ఎస్’ గుర్తు కనిపిస్తుంది.

నాణేల తయారీ వెనుక ఎన్నో కథలు

ఈ నాణేలు తయారైన కాలానికి కూడా ప్రత్యేక చారిత్రక నేపథ్యం ఉంది. 1893లో అమెరికాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో కొత్త నాణేలకు పెద్దగా డిమాండ్ లేకపోయింది. ఈ పరిస్థితుల్లో 24 నాణేలు మాత్రమే ఎందుకు తయారయ్యాయన్న దానిపై ఇప్పటికీ భిన్న కథనాలు ఉన్నాయి.

మిగిలిపోయిన కొద్దిపాటి లోహాన్ని ఉపయోగించి వీటిని తయారు చేశారనే అభిప్రాయం ఒకవైపు ఉంది. మరో కథనం ప్రకారం.. అప్పటి మింట్ సూపరింటెండెంట్ జాన్ డాగెట్ తనకు పరిచయమైన బ్యాంకర్లకు బహుమతులుగా ఇచ్చేందుకు వీటిని ప్రత్యేకంగా తయారు చేయించారని చెబుతారు. ఈ నాణేల తయారీ వెనుక ఉన్న అస్పష్టత, ఆసక్తికరమైన చరిత్ర కూడా వాటి విలువను మరింత పెంచాయి.

1957లో కేవలం 4,750 డాలర్లకే కొనుగోలు

తాజాగా వేలం వేసిన ఈ ప్రత్యేక నాణేనికి కూడా ఆసక్తికరమైన గతం ఉంది. ప్రముఖ నాణేల సేకరణ నిపుణుడు డేవిడ్ బోవర్స్ 1957లో తన 19వ ఏట దీనిని కేవలం 4,750 డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

దాదాపు 36 సంవత్సరాల పాటు మార్కెట్‌లో కనిపించకుండా ఉన్న ఈ అరుదైన నాణెం మళ్లీ వేలానికి రావడంతో సేకరణకారుల దృష్టిని ఆకర్షించింది. చివరకు దాని ధర 12.5 లక్షల డాలర్లకు చేరుకుంది.

అరుదైనదనం, చారిత్రక నేపథ్యం, పరిమిత సంఖ్యలో తయారీ, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలు.. ఇలా అన్నీ కలిసి 10 సెంట్ల విలువైన ఈ చిన్న నాణేన్ని రూ.10 కోట్లకు పైగా విలువ చేసే అరుదైన సంపదగా మార్చాయి.

also read: తెలంగాణలో కృత్రిమ పన్నీర్‌పై ఏడాది నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు