-
మీర్పేట్ టీఎస్ఆర్ నగర్ ఫేజ్-2లో నీటి కోసం నిత్యం యుద్ధమేనా..?
-
ప్రతిరోజూ తాగునీటి కోసం అవస్థలు…!
-
సమస్యను పరిష్కరించాలంటున్న స్థానికులు ఆవేదన
క్రైమ్ మిర్రర్, మీర్పేట్ (హైదరాబాద్): మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని TRS నగర్ ఫేజ్-2లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, అవసరమైన స్థాయిలో నీటి సరఫరా జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు.
ఇళ్లలో నిత్యావసరాలకు అవసరమైన నీరు అందకపోవడంతో మహిళలు, వృద్ధులు సహా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. నీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
-
ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఎందుకు?
TRS నగర్ ఫేజ్-2లో నీటి సమస్యకు అసలు కారణం ఏమిటన్నది అధికార యంత్రాంగం స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. పైప్లైన్ సమస్యా..? నీటి సరఫరాలో అంతరాయమా..? లేక సరిపడా నీటి సరఫరా లేకపోవడమా..? అనే విషయాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ ఎదురవుతున్న నీటి ఇబ్బందులకు తక్షణ చర్యలు తీసుకుని, నిరంతర నీటి సరఫరా అందేలా చూడాలని కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులు అధికారుల దృష్టికి చేరుతాయా..? సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుంది..? అన్నది వేచి చూడాల్సి ఉంది.
