Homeజాతీయంవిజయ్ మాల్యా కేసులో ఈడీ కీలక వాదనలు.. బకాయిలు చెల్లించినా క్రిమినల్ కేసులు రద్దు కావు!

విజయ్ మాల్యా కేసులో ఈడీ కీలక వాదనలు.. బకాయిలు చెల్లించినా క్రిమినల్ కేసులు రద్దు కావు!

పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకులకు భారీ మొత్తంలో బకాయిలు రికవరీ అయినంత మాత్రాన మాల్యాపై నమోదైన మనీలాండరింగ్ కేసులు, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ముగించలేమని బాంబే హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈడీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు విజయ్ మాల్యా చెల్లించాల్సిన అసలు మొత్తం సుమారు రూ.6,203 కోట్లు కాగా.. వడ్డీతో కలిపి దాదాపు రూ.15 వేల కోట్ల వరకు రికవరీ జరిగిందని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే బ్యాంకులకు నష్టం భర్తీ అయినందున తనపై కొనసాగుతున్న కేసులను ముగించాలని వారు కోరుతున్నారు.

అయితే మాల్యా వాదనను ఈడీ వ్యతిరేకించింది. బ్యాంకుల నుంచి బకాయిల రికవరీ అనేది సివిల్ అంశానికి సంబంధించినదని, ఆ మొత్తాన్ని తిరిగి పొందడం వల్ల మనీలాండరింగ్ వంటి క్రిమినల్ నేరం తీవ్రత తగ్గదని పేర్కొంది. నేరానికి సంబంధించిన దర్యాప్తు, క్రిమినల్ చర్యలు వాటి చట్టపరమైన పరిధిలో కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది.

పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 8(8) ప్రకారం చట్టబద్ధమైన హక్కులు కలిగిన బ్యాంకులకు సుమారు రూ.14,131.60 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించి అప్పగించినట్లు ఈడీ తెలిపింది. అయితే ఆస్తులను తిరిగి ఇవ్వడం బాధితులకు కల్పించే ఆర్థిక ఉపశమన చర్య మాత్రమేనని, దాని ఆధారంగా నేరం జరిగిన అంశాన్ని పక్కన పెట్టలేమని వివరించింది.

ఇక విజయ్ మాల్యా 2016 నుంచి భారత్‌కు దూరంగా ఉంటున్న విషయాన్ని కూడా ఈడీ కోర్టుకు గుర్తుచేసింది. 2019లో ఆయనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు క్రిమినల్ కోర్టు పరిధిలోకి ఆయన లొంగలేదని తెలిపింది.

ఈ నేపథ్యంలో భారత్‌కు తిరిగి వచ్చి న్యాయ ప్రక్రియను ఎదుర్కొనే ఉద్దేశం ఉందా? లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని బాంబే హైకోర్టు మాల్యాకు తుది అవకాశం ఇచ్చింది. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

also read: రష్మిక కొత్త బాధ్యత.. యువత కలలకు HYBE ఇండియా వేదిక!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు