క్రైమ్ మిర్రర్ : జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసును నల్లపాడు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో వైసీపీ నేత కంకర నరేంద్ర రెడ్డిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని జిల్లా కోర్టులో హాజరుపరిచారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. శ్రీనివాస యాదవ్‌ను హత్య చేయించేందుకు నరేంద్ర రెడ్డి కొందరు రౌడీషీటర్లతో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించినట్లు సమాచారం. ఇందుకోసం రూ.1.5 కోట్లు సుపారీ ఇచ్చినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఈ విషయం ముందుగానే తెలియడంతో శ్రీనివాస యాదవ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో సుపారీ తీసుకున్న రౌడీషీటర్ ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. అతడిని విచారించిన అనంతరం పోలీసులు సేకరించిన వివరాల ఆధారంగా నరేంద్ర రెడ్డిపై దృష్టి సారించారు. కేసుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
కాగా, గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నరేంద్ర రెడ్డిపై పలు వివాదాలు, అరాచకాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని జనసేన నేత శ్రీనివాస యాదవ్ అడ్డుకున్న నేపథ్యంలోనే తనపై కక్ష పెంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన హత్యకు కుట్ర జరిగినట్లు ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం నరేంద్ర రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను దర్యాప్తులో భాగంగా సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
also read : పాకిస్థాన్‌లో 125 ఏళ్ల హిందూ ఆలయం నేలమట్టం.. మదర్సాలో విలీనం చేశారంటూ ఆరోపణలు
