పశ్చిమ బెంగాల్‌లో జాతీయవాదం, దేశభక్తి అంశాలపై ముఖ్యమంత్రి సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరూ ‘వందేమాతరం’ పాడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. దేశభక్తి విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజీకి వెళ్లబోదని వ్యాఖ్యానించారు.
శనివారం భవానీపూర్ నియోజకవర్గంలో అన్నపూర్ణ యోజన లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో సువేందు అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో నివసించాలంటే ‘వందేమాతరం’ పాడాల్సిందేనని ఆయన అన్నారు. జాతీయవాదం, దేశభక్తి విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇటీవల జాదవ్‌పూర్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూనివర్సిటీ ప్రాంగణంలో కొన్ని దేశ వ్యతిరేక, జిహాదీ శక్తులు ఉన్నాయని సువేందు ఆరోపించారు. వందేమాతరం గానం, జాతీయ పతాకావిష్కరణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలను కొందరు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
అంతేకాకుండా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను క్యాంపస్‌లో నిర్వహించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలోనే కాకుండా దాని వెలుపల కూడా జాతీయవాద భావజాలాన్ని బలపరుస్తామని సువేందు అధికారి తెలిపారు.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ జాతీయవాదం, భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. 2026 మేలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ సమయంలో ‘వందేమాతరం’ ఆలాపనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని పౌరులందరికీ ‘వందేమాతరం’ను తప్పనిసరి చేస్తూ ఇప్పటివరకు ప్రత్యేకంగా అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో తాజాగా సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతానికి రాజకీయ ప్రకటనగా మాత్రమే చూడాల్సి ఉంటుంది.
also read: కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. ఈసారి హద్దులు దాటిన కామెంట్స్!
