Homeతెలంగాణమంత్రుల మౌనం దేనికి సంకేతం?!

మంత్రుల మౌనం దేనికి సంకేతం?!

-సీఎంపై వ్యక్తిగత విమర్శలపై స్పందించని అమాత్యులు
-66 మంది ఎమ్మెల్యేలు ఉంటే రేవంత్ కు మద్దతు 17 మంది మాత్రమే
-తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :-
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలు కుదిపేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ల మీద ఆమె హాట్ కామెంట్స్ చేశారు. తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు సురేఖ. మరోవైపు తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. తన టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదని.. తాను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లకు విధేయురాలినని.. రేవంత్ రెడ్డి మీదనే తన పోరాటం అని మరోసారి సుస్మిత పటేల్ పునరుద్ఘాటించారు. అయితే ఇంత జరుగుతున్నా క్యాబినెట్లో మంత్రులు సీఎం రేవంత్ కు అండగా నిలవకపోవడం ఇప్పుడు కొత్త చర్చ.

మిగతా వారి మాట ఏంటి..
సీఎం రేవంత్ పై సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో వెనువెంటనే 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీభవన్కు చేరుకున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆమెతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ 14 మంది మంత్రుల్లో ఏ ఒక్కరు ముందుకు వచ్చి కనీసం స్పందించడం లేదు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో అంత మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బయటకు రావడం కొత్త చర్చకు దారితీస్తోంది. కేవలం 20 మంది మాత్రమే రేవంత్ వర్గమా అంటూ ప్రశ్నించిన వారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో సొంతంగా 66 మంది సంఖ్యాబలం ఉంది. కానీ నిన్నటి సమావేశానికి 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. అయితే మిగతా ఎమ్మెల్యేలు, అన్నింటికీ మించి మంత్రులు ఎందుకు బయటకు రావడం లేదు అనేది ప్రశ్న. వారంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకమా? అనే కొత్త చర్చ ప్రారంభం అయింది.

అందరిదీ అదే తీరు..
కాంగ్రెస్ పార్టీలో ఇంత పరిణామాలు జరుగుతున్నా మంత్రులు నోరు తెరవకపోవడం మాత్రం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రిపై ఇంతటి తీవ్ర ఆరోపణలు వచ్చినా ఒక్క మంత్రి కూడా నోరు మెదపలేదు. గతంలో సుస్మిత ఆరోపణలు చేసినప్పుడు స్పందించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో కూడా అదే పరిస్థితి ఉంది. అయితే పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడినా వివాదాస్పదముద్రపడే అవకాశం ఉంది. మరోవైపు అనవసర వివాదాలు కొనితెచ్చుకోవడం ఏమిటనే వాదన కూడా ఉంది. కానీ ఏకంగా ముఖ్యమంత్రి పైనే వ్యక్తిగత విమర్శలు చేస్తే మంత్రులు మౌనంగా ఉండడం మాత్రం తెలంగాణలో ఒకసారి కొత్త వివాదానికి కేంద్ర బిందువు కావడమే.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు