తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK పార్టీ) అనూహ్య విజయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల సందర్భంగా ఒక నాయకుడు చేసిన సవాల్, ఆ సవాల్ నెరవేరకపోవడంతో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి రాజుకున్న సమయంలో నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో నీలగిరి జిల్లాకు చెందిన ఏఐఏడీఎంకే (AIADMK) జిల్లా కార్యదర్శి, న్యాయవాది అయిన బాలానంద కుమార్.. విజయ్ పార్టీ TVK పై సంచలన సవాల్ విసిరారు.రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో TVK పార్టీ కనీసం 10 సీట్లు కూడా గెలవదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ పార్టీ 10 స్థానాలకు పైగా గెలిస్తే, తాను తన మీసం తీసేసుకుంటానని బహిరంగంగా సవాల్ చేశారు. అప్పట్లో ఈ సవాల్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
నా పరువు తీశారు.. డాన్సర్ మాధురి పోలీసులకు ఫిర్యాదు!
అయితే, ఎన్నికల ఫలితాలు బాలానంద కుమార్ అంచనాలను తలకిందులు చేశాయి. విజయ్ పార్టీ TVK కేవలం 10 సీట్లు గెలవడమే కాదు, ఏకంగా 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి అధికారంలోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భారీ విజయంతో TVK పార్టీ తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది.ఈ నేపథ్యంలో, తాను గతంలో చేసిన సవాల్‌కు కట్టుబడి బాలానంద కుమార్ తన మీసాలను తొలగించుకున్నారు. ఎప్పుడూ నిండు మీసాలతో, గంభీరంగా కనిపించే ఆయన, మీసాలు లేకుండా ఉన్న తన కొత్త ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన సవాల్‌కు కట్టుబడి ఉన్నందుకు ప్రశంసిస్తుండగా, మరికొందరు మీసాలు తీసేయడంతో ఆయన చాలా కొత్తగా, గుర్తుపట్టలేనంతగా మారిపోయారని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, రాజకీయాల్లో ఇలాంటి సరదా సవాళ్లు, వాటి ఫలితాలు ఎప్పుడూ ప్రజలకు ఆసక్తిని కలిగిస్తాయనడంలో సందేహం లేదు.
