Homeక్రైమ్Breaking News: కొండాపూర్‌లో కుప్పకూలిన 7 అంతస్థుల భవనం..!

Breaking News: కొండాపూర్‌లో కుప్పకూలిన 7 అంతస్థుల భవనం..!

  • కుప్పకూలిన భవనం.. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌కు పాక్షిక నష్టం

  • 40 గజాల్లో ఏడంతస్తులా? అనుమతులపై స్థానికుల అనుమానాలు..

  • టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రశ్నల వర్షం

క్రైమ్ మిర్రర్, కొండాపూర్: మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో సుమారు 40–50 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు.

భవనం కూలిన సమయంలో భారీ శబ్దం రావడంతో సమీపంలోని ప్రజలు, హాస్టళ్లలో ఉంటున్న వారు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న వైట్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్‌పై పడటంతో ఆ భవనం కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా గాయాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

  • అనుమతులపై ప్రశ్నలు

అతి తక్కువ విస్తీర్ణంలో ఏడంతస్తుల భవనం నిర్మాణానికి అనుమతులు ఎలా లభించాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ముఖ్యంగా నాలా పక్కనే ఇలాంటి బహుళ అంతస్తుల నిర్మాణానికి సంబంధిత శాఖలు ఎలాంటి అనుమతులు మంజూరు చేశాయి? భవన నిర్మాణానికి ఆమోదించిన ప్లాన్, నిర్మాణ విస్తీర్ణం, అంతస్తుల సంఖ్య నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

నిర్మాణ సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించారా? నిర్మాణ స్థలాన్ని సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేశారా? అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం జరిగితే అధికారులు ఎందుకు ముందుగానే చర్యలు తీసుకోలేదన్న అంశంపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

భవనం కూలిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, ఆమోదిత ప్లాన్, నిర్మాణ నిబంధనల అమలు, అధికారుల పర్యవేక్షణ తదితర అంశాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అసలు ఈ నిర్మాణానికి అనుమతులు ఎవరిచ్చారు? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగితే అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్న ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు