Homeక్రైమ్అంజయ్య నగర్‌లో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. శిథిలాల కింద గాలింపు ముమ్మరం

అంజయ్య నగర్‌లో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. శిథిలాల కింద గాలింపు ముమ్మరం

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అంజయ్య నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. భవనం శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో అధికారులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. స్థానికుల వివరాల ప్రకారం.. సుమారు 50 గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ఏడంతస్తుల భవన నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. సరైన నిపుణుల సలహాలు, నిర్మాణ ప్రమాణాలను పాటించకుండా పనులు చేపట్టడం వల్లే భవనం ఒక్కసారిగా కూలిపోయి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

భవనం కూలిన సమయంలో భారీ శబ్దం రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శిథిలాలు చుట్టుపక్కల నిర్మాణాలపై పడటంతో పక్కనే ఉన్న కొన్ని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని మరో అపార్ట్‌మెంట్‌కు కూడా నష్టం జరిగినట్లు సమాచారం. మరో భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో సమీపంలో ఉన్న రమణారెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనం కూలిన సమయంలో నిర్మాణంలో కార్మికులు లేదా ఇతర వ్యక్తులు ఉన్నారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

పక్కనే ఉన్న హాస్టల్‌లో నివసిస్తున్న వారు భారీ శబ్దం, భవనం కూలిన దృశ్యంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో హాస్టల్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవన నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటించారా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ప్రమాదానికి అసలు కారణమేంటన్నది పూర్తి స్థాయి విచారణ అనంతరం తేలనుంది.
also read : రేవంత్ అమెరికా పర్యటనకు బ్రేక్…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు