క్రైమ్ మిర్రర్ : బీమా సేవల పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ యువకుడిని మోసం చేసి అతడి ఖాతా నుంచి భారీ మొత్తాన్ని కాజేశారు. క్రెడిట్ కార్డు వివరాలను సేకరించి రూ.78,947లను అక్రమంగా డెబిట్ చేసిన ఘటనపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. హస్తినాపురంలోని సరస్వతీనగర్కు చెందిన వియాపు శ్రీను (25) సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 15న మధ్యాహ్నం సుమారు 2.15 గంటల సమయంలో ఆయనకు గుర్తుతెలియని మొబైల్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తులు బీమాకు సంబంధించిన వివరాలు చెబుతూ శ్రీనును నమ్మించినట్లు తెలుస్తోంది.
అనంతరం బీమా సేవలకు సంబంధించినదిగా కనిపించే ఓ వెబ్సైట్ ద్వారా క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేయించినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత శ్రీను తన ఖాతాను పరిశీలించగా, తన అనుమతి లేకుండా రూ.78,947 డెబిట్ అయినట్లు గుర్తించారు. దీంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు తెలుసుకుని వెంటనే ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించారు. శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నంబర్ 1101/2026గా నమోదు చేసి, బీఎన్ఎస్లోని 318(4), 319(2) సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 66(సీ), 66(డీ) సెక్షన్ల కింద విచారణ కొనసాగిస్తున్నారు.
మోసానికి ఉపయోగించిన ఫోన్ నంబర్, వెబ్సైట్ వివరాలు, క్రెడిట్ కార్డు లావాదేవీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. డబ్బు ఏ ఖాతాకు బదిలీ అయింది, ఈ మోసానికి వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బీమా, బ్యాంకింగ్ లేదా ఇతర ఆర్థిక సేవల పేరుతో కార్డు నంబర్, ఓటీపీ, సీవీవీ వంటి సున్నితమైన వివరాలను అడిగితే ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన వెంటనే బ్యాంకుకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
also read : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విషాదం.. రైలు కింద పడి పోస్టుమాస్టర్ మృతి
