Homeజాతీయం‘విమల్ ఇలాచీ’ యాడ్‌పై షారుఖ్, అజయ్, టైగర్‌కు ఎఫ్‌డీఏ నోటీసులు.. భారీ జరిమానా తప్పదా?

‘విమల్ ఇలాచీ’ యాడ్‌పై షారుఖ్, అజయ్, టైగర్‌కు ఎఫ్‌డీఏ నోటీసులు.. భారీ జరిమానా తప్పదా?

ప్రముఖ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లు నటించిన ‘విమల్ ఇలాచీ’ ప్రకటనపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చర్యలకు దిగింది. ఈ ప్రకటన పాన్ మసాలా ఉత్పత్తులను పరోక్షంగా ప్రోత్సహించేలా ఉందనే ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు నటులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, విక్రయం, నిల్వపై నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ‘విమల్ ఇలాచీ’ ప్రకటనపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాన్ మసాలాను గుర్తు చేసే విధంగా ప్రకటన రూపొందించారని ఎఫ్‌డీఏ పేర్కొన్నట్లు సమాచారం.

15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

నోటీసులు అందుకున్న నటులు 15 రోజుల్లోగా తమ వివరణను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, సంబంధిత ప్రకటనకు సంబంధించిన ఎండార్స్‌మెంట్ ఒప్పంద వివరాలను కూడా అధికారులకు అందించాలని ఎఫ్‌డీఏ సూచించింది. ప్రకటనకు సంబంధించిన సోషల్ మీడియా కంటెంట్‌ను తొలగించాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది.

‘ఎవరినీ వదిలిపెట్టం’.. ఎఫ్‌డీఏ కమిషనర్

ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే కఠినంగా స్పందించారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలోని నిబంధనల ప్రకారం తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో భాగమైన తయారీదారులు, ప్రచారకర్తలు, స్పాన్సర్లు, ప్రచురణకర్తలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

నటులు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఒక్కొక్కరిపై గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించినట్లు సమాచారం.

సెలబ్రిటీల బాధ్యతపై చర్చ

తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టంలోని సెక్షన్ 24, 53 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే జరిమానా విధించే ప్రక్రియలో సంబంధిత అధికారుల పాత్రపై న్యాయపరమైన అంశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం నటులు సమర్పించే వివరణ, ఎఫ్‌డీఏ చేపట్టే తదుపరి విచారణ ఆధారంగానే తుది నిర్ణయం వెలువడనుంది. ఈ పరిణామంతో నిషేధిత ఉత్పత్తులను పరోక్షంగా ప్రచారం చేసే ‘సరోగెట్ అడ్వర్టైజింగ్‌’లో సెలబ్రిటీల బాధ్యతపై మరోసారి చర్చ మొదలైంది.

also read: బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసు.. నేడు ఈడీ ముందుకు నిధి అగర్వాల్

తాజావార్తలు