Homeక్రైమ్కళ్లముందే ఫోన్ చోరీ.. ధైర్యంగా దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన కవలలు

కళ్లముందే ఫోన్ చోరీ.. ధైర్యంగా దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన కవలలు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇద్దరు కవల సోదరీమణులు చూపించిన ధైర్యసాహసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి. తమ ఫోన్‌ను లాక్కొని పారిపోయిన దుండగుడిని బైక్‌పై వెంబడించిన ఆ యువతులు.. ప్రమాదంలో కిందపడినా వెనక్కి తగ్గలేదు. చివరకు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి సాహసాన్ని గుర్తించిన పోలీసులు ప్రత్యేకంగా సన్మానించారు.

గ్వాలియర్‌కు చెందిన 24 ఏళ్ల కవల సోదరీమణులు న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు. శనివారం ఇద్దరూ తమ వాహనంపై కళాశాలకు బయలుదేరారు. పరావ్ బ్రిడ్జి సమీపంలో వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి వారిలో ఒకరి చేతిలో ఉన్న మొబైల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కొని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఫోన్ చోరీకి గురైన వెంటనే సోదరీమణులు అప్రమత్తమయ్యారు. ఏమాత్రం భయపడకుండా తమ వాహనంతో నిందితుడిని వెంబడించారు. మార్గమధ్యంలో సాయం కోసం కేకలు వేసినా.. వెంటనే ఎవరూ స్పందించకపోవడంతో వారే నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

ఫూల్‌బాగ్ చౌక్ సమీపంలోకి చేరుకున్న సమయంలో ఎదురుగా ఓ టెంపో రావడంతో రోడ్డుపై వాహనాల వేగం తగ్గింది. ఈ క్రమంలో నిందితుడి బైక్, సోదరీమణులు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొన్నాయి. దీంతో నిందితుడితో పాటు ఇద్దరు యువతులు కూడా కిందపడిపోయారు.

అయితే గాయాలైనప్పటికీ ఆ సోదరీమణులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం తమ మొబైల్‌ఫోన్‌ను తిరిగి స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని పంజాబ్‌కు చెందిన మన్‌ప్రీత్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడు గతంలో ఇలాంటి చోరీలకు పాల్పడ్డాడా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న గ్వాలియర్ ఎస్ఎస్పీ ధర్మవీర్ సింగ్ యాదవ్ కవల సోదరీమణులను తన కార్యాలయానికి పిలిపించి అభినందించారు. వారి ధైర్యాన్ని ప్రశంసిస్తూ సన్మానించారు. నేరాలను అరికట్టడంలో ప్రజల అప్రమత్తత, ధైర్యం కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగినా నిందితుడిని వదలకుండా పట్టుకున్న యువతుల ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కష్ట సమయంలో ధైర్యంగా స్పందిస్తే నేరస్తులను అడ్డుకోవచ్చని ఈ ఘటన మరోసారి చాటిచెప్పిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

also read: UPI ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్‌న్యూస్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు